నిరుడు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కల్లో 93 శాతం బతికాయని... ఆరోవిడత హరితహారంలో 12 కోట్లకు పైగా మొక్కలు నాటి అన్నింటినీ బతికించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు. ఆరోవిడత హరితహారం సన్నాహకాల్లో భాగంగా అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, డీఆర్డీఓలు, డీపీఓలు, డీఎఫ్ఓలు, ఎంపీడీఓలు, మండలస్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో మంత్రి దృశ్యమాద్యమ సమీక్ష నిర్వహించారు.
నూరుశాతం పెరిగేలా చర్యలు
ఈ ఏడాది లక్ష్యమైన 30కోట్లలో పంచాయితీరాజ్ శాఖ లక్ష్యమైన 12కోట్ల 67లక్షల మొక్కలు నాటి నూటికి నూరు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎర్రబెల్లి సూచించారు. నర్సరీల్లో మొక్కల లభ్యతని గుర్తించి మండలాల వారీగా, మొక్కల జాతుల వారీగా స్టాక్‌ను అంచనా వేయాలన్నారు. తొందరగా పెరిగే మొక్కలు, నాటే సమయానికి కాస్తా ఎత్తైన మొక్కలను ఎంచుకోవాలని సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుల చుట్టూ ఫెన్సింగ్‌గా బాగా పెరిగే మొక్కలను పెట్టాలన్నారు. అలాగే ఫ్రైడేను డ్రై డే, గ్రీన్ డేగా పాటించాలని మంత్రి ఆదేశించారు.
ప్రతి ఇంటికీ కనీసం ఆరు మొక్కలు పంపిణీ చేయాలి. ఆయా మొక్కలను ప్రతి ఇంట్లో నాటి, సంరక్షించేలా చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు ప్రజలను చైతన్య పరచాలి. అవసరమైతే గ్రామసభలు నిర్వహించాలి. గ్రామాల్లో డప్పు చాటింపు ద్వారా హరితహారం ప్రాధాన్యతలను ప్రజలకు తెలపాలి. పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన ప్లాంటేషన్, గ్రీన్ కవర్ కమిటీలు ఈ విషయంలో క్రియాశీలకంగా పని చేయాలి.
-ఎర్రబెల్లి దయాకరరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
చర్యలు తప్పవు
ఎప్పటికప్పుడు నర్సరీలు, నాటిన మొక్కలను తనిఖీ చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి ఆదేశించారు. గతంలో కంటే పంచాయతీరాజ్ చట్టం మరింత కఠినంగా ఉందని, చెట్టు నరికే వారిపై, మొక్కలను తొలగించే వారిపై కఠిన చర్యలు, జరిమానాలుంటాయని హెచ్చరించారు. హరితహారం లక్ష్యాలకు విరుద్ధంగా ప్రవర్తించే, వ్యవహరించే వ్యక్తులు, అధికారులపై చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్