ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపరచడం ద్వారా నిరుపేదలకు వైద్య ఖర్చుల భారం లేకుండా చేయవచ్చని మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. బీఆర్‌కే భవన్‌లో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. పేద కుటుంబాలు వైద్యానికి డబ్బు ఖర్చు పెట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాయన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ కంటే... ఆరోగ్య శ్రీ వందరెట్లు మెరుగైనదని పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీని బలోపేతం చేయడం సహా... లీకేజీలను అరికట్టడానికి కమిటీ వేయాలని ఆదేశించారు. పాత పద్ధతులను పక్కన పెట్టి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విధివిధానాలు రూపొందించాలని కోరారు. లీకేజీలపై దృష్టి సారిస్తూ... ట్రస్ట్‌ను మోసం చేసే ఆస్పత్రులపై ఉక్కుపాదం మోపనున్నట్టు ఈటల పేర్కొన్నారు.
ఆరోగ్య శ్రీ జాబితాలో ఉన్న ఆస్పత్రులు చికిత్సకు నిరాకరిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.199 కోట్ల బకాయిలు ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఆరోగ్య శ్రీ కోసం అప్లై చేసుకున్న ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతులు జారీ చేశారు.
ఇదీ చదవండి : పోలీస్ వాహనం ఢీకొని ఒకరు.. టిప్పర్ చక్రాల కింద నలిగి ఇంకొకరు..