వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి కుటుంబంలో కుమారుడు, కుమార్తె.. ఇద్దరికీ డెంగీ వచ్చింది. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పిస్తే ఉద్యోగుల ఆరోగ్య కార్డు చెల్లుబాటు కాదని చెప్పారు. 7 రోజుల చికిత్స అనంతరం ఇద్దరూ కోలుకున్నారు. కుమారుడికి రూ.70 వేలు, కుమార్తెకు రూ.1.20 లక్షల బిల్లు వేసినట్లు ఆయన వాపోయారు.
హైదరాబాద్ రామంతాపూర్‌కు చెందిన కారు మెకానిక్ కుమార్తె(14)కు ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంలో ఆరు రోజుల చికిత్స తీసుకున్నాక డెంగీ నుంచి కోలుకుంది. ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరమూ రాకున్నా రూ.2 లక్షల బిల్లయింది. కొవిడ్ కాలంలో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా.. ఈ బిల్లు మరింత భారం మోపిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణంగా ఆరోగ్యవంతుడి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. డెంగీ సోకితే వీటి సంఖ్య తగ్గుతుంది. కనిష్ఠ స్థాయి కంటే పడిపోతే.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులను భయపెట్టడం ప్రారంభమవుతోంది. ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గుతున్నకొద్దీ ఇది తారస్థాయికి చేరుకుంటోంది. ఇదే అదనుగా కొందరు ప్రైవేటు వైద్యులు ఆసుపత్రిలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. తీరా చేరాక ఐసీయూలో చికిత్స, రకరకాల పరీక్షలు, అవసరం లేకుండా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తుండటంతో బిల్లు తడిసిమోపెడవుతోంది. రాష్ట్రంలో గద్వాల, తాండూరు, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, జనగామ, కొత్తగూడెం, భద్రాచలం, నల్గొండ, సూర్యాపేట తదితర 12 ఆసుపత్రుల్లో నాలుగేళ్ల కిందటే రక్తం నుంచి ప్లేట్‌లెట్లను విడగొట్టే పరికరాలను నెలకొల్పారు. అంతకుముందు నుంచే ఉస్మానియా ఆసుపత్రిలో 2, గాంధీలో 2, ఎంజీఎం(వరంగల్)లో 2, రిమ్స్(ఆదిలాబాద్)లో 2, నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 2 చొప్పున పరికరాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కిట్లు లేని కారణంగా.. ప్లేట్‌లెట్లను విడగొట్టే ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఈ పరికరాలున్నాయని ప్రజలకు తెలియజేయడం ద్వారా వారిపై ఆర్థిక భారం తప్పుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబరు 10 వరకు 3144 డెంగీ కేసులు నమోదయ్యాయి.
9154170960 నంబరుకు ఫిర్యాదు చేయండి: డీహెచ్
డెంగీ చికిత్సలో భాగంగా కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల వైఖరిలో మార్పు అవసరమని, అనవసరంగా ప్లేట్‌లెట్లు ఎక్కిస్తూ డబ్బులు దోచుకోవద్దని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు తాజాగా మీడియాముఖంగా విజ్ఞప్తి చేశారు. డెంగీ చికిత్సకు అధిక బిల్లులు వేసిన ఆసుపత్రులపై 9154170960 వాట్సప్ నంబరుకు ఫిర్యాదులు పంపించాలని సూచించారు.
అనవసరంగా ప్లేట్‌లెట్లు వద్దు
సాధారణంగా డెంగీ జ్వరం వచ్చినవారిలో 95 శాతం మందికి ఎలాంటి ప్రత్యేక చికిత్స అవసరం ఉండదు. నోటి ద్వారా ఇచ్చే ద్రావణాలు, ఐవీ ద్రావణాలు, పారాసెటమాల్ ఔషధాలు, విశ్రాంతి ద్వారా తగ్గిపోతుంది. జ్వరం తగ్గిన తొలి మూణ్నాలుగు రోజుల్లో అత్యవసర పరిస్థితులు ఎదురైతే అప్రమత్తత అవసరం. డెంగీయే కాదు.. ఏ రక్త సంబంధ వ్యాధిలోనైనా అనవసరంగా ప్లేట్‌లెట్లు, ప్లాస్మాలను మోతాదుకు మించి ఇస్తే.. అక్యూట్ లంగ్ ఇంజ్యూరీ, కొన్నిసార్లు అలర్జిక్ రియాక్షన్లు, ఇతర ఇన్‌ఫెక్షన్లూ రావచ్చు.
-డాక్టర్ పవన్‌రెడ్డి, జనరల్ ఫిజీషియన్, సన్‌షైన్ ఆసుపత్రి
10-15 వేల కంటే తగ్గితేనే..
ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కంటే తగ్గినప్పుడు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలి. 10-15 వేలకు తగ్గినప్పుడు మాత్రమే రక్తస్రావం ఉన్నా, లేకపోయినా వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ 20 వేలల్లో ఉంటే.. రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరం పడుతుంది. కొందరిలో 30 వేలకు పడిపోయినా 2-3 రోజుల పాటూ అలాగే ఉండిపోవచ్చు. మళ్లీ 3-4 రోజుల్లో పెరిగే అవకాశం ఉంటుంది. మరికొందరిలో ఒక్కసారిగా లక్ష నుంచి 30 వేలకు పడిపోవచ్చు. అప్పుడు సత్వర చికిత్స అవసరం.
-డాక్టర్ మనోహర్, విశ్రాంత ఆచార్యులు, ఉస్మానియా వైద్య కళాశాల
ఇదీ చదవండి: Telangana assembly sessions 2021 : శాసనసభ సమావేశాల్లో ఏమేం చర్చిద్దాం? ఏఏ బిల్లులు ప్రవేశ పెడదాం?