కరవు జిల్లా అయిన అనంతపురానికి అండగా నిలిచింది మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుటుంబం. పేద మహిళల ఆర్థికాభివృద్ధి కోసం రూ.రెండు కోట్లతో జీవనోపాధి ప్రోత్సాహక ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సాయం అందజేసి వారు సొంత కాళ్ల మీద నిలబడేలా చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం. అనంతపురం జిల్లాలో పేదరిక నిర్మూలన కార్యక్రమాల అమలులో సుదీర్ఘ అనుభవం ఉన్న ‘యాక్షన్ ప్రెటర్నా ఎకాలజీ సెంటర్’ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు అమలు కానుంది.
సత్య నాదెళ్ల తండ్రి బి.ఎన్.యుగంధర్ అనంతపురం జిల్లాకు చెందిన వారే. ఆయన కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు అనంతపురంలో జిల్లా కరవు నివారణ సంస్థను ఏర్పాటు చేయించడంలో కీలకపాత్ర వహించారు. ప్రస్తుతం చేపడుతున్న జీవనోపాధి ప్రాజెక్టు అమలు మార్గదర్శకాలను సత్య నాదెళ్ల సతీమణి అనుపమ తండ్రి అయిన కె.ఆర్.వేణుగోపాల్ రూపొందించారు. గతంలో ప్రధానమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసిన ఆయన పేదరిక నిర్మూలనపై 1992లో సార్క్ దేశాలు ప్రవేశపెట్టిన నివేదికకు రూపకల్పన చేశారు. దేశంలో ఈ రంగంలో అనేక కార్యక్రమాలను రూపొందించిన అనుభవం ఉంది ఆయనకు.
3,000 మంది మహిళలకు ప్రయోజనం
మెట్ట రైతు, వ్యవసాయ కూలీ కుటుంబాల్లోని 3,000 మంది మహిళలకు జీవనోపాధిని, ఆదాయ అవకాశాలను పెంచడం ద్వారా వారి కుటుంబాలకు భద్రత కల్పించడం ప్రధాన లక్ష్యం. 600 స్వయం సహాయక సంఘాలకు అవసరమైన ఆర్థిక సాయం అందించడం, పొదుపు చేయించడం, తిరిగి చెల్లించడం ఇందులో భాగం. ఒక్కో సంఘానికి సరాసరిన ఏడాదికి రూ. 31,500 అందుతుంది. చిరువ్యాపారాలు, పాల అమ్మకం, పొట్టేళ్ల పెంపకం, టైలరింగ్, కంబళ్ల తయారీ.. ఇలా మొత్తం 20 రకాల పనులకు స్వయం సహాయక సంఘాలకు రుణసాయం అందుతుంది.
- యాక్షన్ ప్రెటర్నా డైరెక్టర్ వై.వి.మల్లారెడ్డి
ఇదీ చదవండి: ఈనెల 17న జగన్, కేసీఆర్తో ప్రధాని భేటీ