ప్రతినెలా ఇంటింటికీ తిరిగి మీటర్ బిల్లులు ఇచ్చేందుకు విద్యుత్ శాఖ ప్రైవేట్ మీటర్ కార్మికులను నియమించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎస్ పరిధిలో 1,800ల మంది పనిచేస్తున్నారు. వారు ఒక్క మీటర్ రీడింగ్ తీస్తే రూ. 2 చెల్లిస్తారు.
నెలలో 10 నుంచి 15 రోజులు మాత్రమే వీరికి పని ఉంటుంది. 3, 4 వేల మీటర్ రీడింగ్‌లు మాత్రమే తీయగలరు. దీనికి తోడు వీరికి ఇప్పుడు కరోనా కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇళ్లలో సమాచారం లేక... వీరిలో కొందరు కొవిడ్ బారిన పడుతున్నారు.
జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. కరోనా సోకి స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న ఇళ్లను గుర్తించే విధంగా స్టిక్కరింగ్ చేయకపోవడం శాపంగా మారుతోంది. ఇళ్లకు వెళ్లినప్పుడు కరోనా సోకిన వాళ్లు మీటర్ రీడింగ్ కార్మికులకు ఆ విషయాన్ని చెప్పడం లేదు.
పాజిటివ్ కేసులు ఉన్న ఇళ్లకు వెళ్లి మీటర్ రీడింగ్ తీసిన 10మందికి పైగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు మీటర్ రీడర్స్ అసోసియేషన్ వెల్లడించింది. అసలే అరకొర జీతాలకు తోడు... కరోనా సోకి తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకిన కార్మికులకు బీమా సౌకర్యం కల్పించి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి : ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాలను లెక్కచేయట్లేదు: రాంచందర్ రావు