KCR on Dalit Bandhu: దళితబంధు పథకం అమలును వేగవంతం చేయాలని, అర్హులైన వారికి మరింత త్వరగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పథకం అమలు తీరుపై సీఎం ప్రగతిభవన్లో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రోజుకు 400 మంది చొప్పున ఇప్పటి వరకు 25 వేల మంది అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు అందించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాహుల్ బొజ్జా ముఖ్యమంత్రికి నివేదించారు.
దళితబంధు కోసం ముందస్తుగానే నిధులు విడుదల చేసినందున గుర్తించిన అర్హులకు నిధులు అందించడంలో జాప్యం జరగరాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పథకాన్ని మరింత ప్రభావవంతంగా, వేగంగా అమలు చేసేందుకు త్వరలో జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దళితబంధు అమలవుతున్న విధానం పట్ల దేశం నలుమూలల నుంచి ప్రశంసలు అందుకుంటున్నామన్నారు. పథకం అమలుతో అనుకున్నదానికంటే ఎక్కువ ఫలితాలు అందుతాయని వ్యాఖ్యానించారు.
దళితబంధు కోసం చేస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిగా మారి తిరిగి లాభాలను ఆర్జించి పెడుతుందని సీఎం చెప్పారు. సామాజిక పెట్టుబడిగా మారి, వ్యవసాయ రంగాని కంటే గొప్పగా స్పిల్ ఎకానమీకి దోహదపడుతుందని వివరించారు. వ్యాపార, వాణిజ్యాలు తద్వారా తిరిగి వచ్చే లాభాలు రాష్ట్ర జీఎస్డీపీని పెంచడంలో దోహదపడుతుందని అన్నారు. ఇప్పటికే దళితబంధు ద్వారా అందిన ఆర్థిక సాయం ద్వారా వ్యాపార, వృత్తి రంగాల్లో దళితులు సాధిస్తున్న విజయాలే అందుకు తార్కాణమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఏడాదికి రెండు లక్షల కుటుంబాలకు ఆర్థికసాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగాలని సీఎం చెప్పారు. తద్వారా దళిత యువతలో ఉన్న నిరాశా నిస్పృహలు తొలగిపోయి ఉత్సాహం పెరుగుతుందని తెలిపారు. వివిధ వృత్తుల్లో, వ్యాపారాల్లో భాగస్వాములు కావడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఆసుపత్రులు, ఎరువుల దుకాణాల వంటి ప్రభుత్వం లైసెన్స్లు ఇస్తున్న ప్రతి విభాగంలో దళితులకు రిజర్వేషన్లు ఏర్పాటు చేసి వారికి అవకాశాలు కల్పించాలని సీఎం కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : పోర్న్ చిత్రాల్లో నటించిందని అనుమానం.. భార్య దారుణ హత్య