ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 'మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాల' నేపథ్యంలో.. పోలీసులు ఏవోబీలో పహారా కాస్తున్నారు. నేటి నుంచి ఆగస్టు 3 వరకు వారోత్సవాలు నిర్వహిస్తామని ఇది వరకే మావోయిస్టులు ప్రకటించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అగ్రనేతలు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏవోబీ ప్రాంతంలో భారీగా మోహరించారు.
మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల విజయవంతానికి మావోయిస్టులు సరిహద్దు గ్రామాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆగస్టు 3 వరకు జరగనున్న ఈ వారోత్సవాల్లో అమరవీరుల సంస్మరణ స్తూపాలు నిర్మించి నివాళి అర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వారోత్సవాలను భగ్నం చేసేందుకు పోలీసులు సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. విప్లవ ఉద్యమంలో అసువులు బాసిన మావోయిస్టులకు ఏటా జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించి నివాళి అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. వారోత్సవాల్లో మావోయిస్టుల దుశ్చర్యలను అడ్డుకునేందుకు 10 రోజుల ముందు నుంచే పెద్దఎత్తున బలగాలను పోలీసులు రంగంలోకి దించారు. ఇటీవల తీగలమెట్టలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన ఆరుగురు మావోయిస్టులతో పాటు, మిలటరీ ప్లాటూన్ కార్యదర్శి కిశోర్, మరో 5 మంది పేరిట ఏవోబీలో భారీ స్తూపం నిర్మించినట్లు సమాచారం.
వారోత్సవాల భగ్నానికి పోలీసుల వ్యూహరచన
ఏటా ఈ సమయంలో అమరవీరుల వారోత్సవాలను మావోయిస్టులు జరుపుతారు. జిల్లాలోని పూర్తి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం భామిని మండలం పొడవునా ఉన్న తువ్వకొండలో గతంలో వీటిని జరిపిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం తువ్వకొండను సురక్షిత ప్రాంతం (షెల్టర్ జోన్)గా ఉపయోగిస్తున్నారని నిఘావర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయినప్పటికీ ఇటీవల కాలంలో ఏవోబీ, విశాఖ మన్యంలో చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశాలు ఉండొచ్చనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒడిశా సరిహద్దులోని మండలాలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు భామిని, సీతంపేట, కొత్తూరు, మెళియాపుట్టి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు వంటి మండలాల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యంగా భామిని మండలం పొడవునా ఉన్న శ్రీకాకుళం-విజయనగరం జిల్లాలు-ఒడిశాకు సరిహద్దులో గల తువ్వకొండ పైన ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నారు.
చర్యలు తీసుకుంటున్నాం...
‘మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారుల నుంచి సూచనలు వచ్చాయి. ఇందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నాం’ అని సీతంపేట ఎస్‌ఐ బి.ప్రభావతి తెలిపారు.
ఇదీ చూడండి: RAMAPPA TEMPLE: రామప్పను చూతము రారండి..