హైదరాబాద్ జలమండలి అధికారుల నిర్లక్ష్యానికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మియాపూర్‌లోని మదీనాగూడలో మహాలక్ష్మి అపార్ట్మెంట్ సెల్లార్ నీట మునిగింది. మంజీరా పైప్ లైన్ మరమ్మతు పనులను నాసిరకంగా చెయ్యగా మంగళవారం తెల్లవారుజామున పైప్‌లైన్ పగిలింది. ఫలితంగా సమీపంలోని అపార్ట్మెంట్ సెల్లార్లోకి నీరు చేరింది. ఒక్కసారిగా వచ్చిన నీటితో అపార్ట్మెంట్ వాచ్‌మ్యాన్ అప్రమత్తమయ్యాడు. ఫ్లాట్ యజమానులను నిద్రలేపగా .. వారు వెంటనే స్థానిక పోలీసులకు, జలమండలి, విద్యుత్ అధికారులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
సెల్లార్లో నివాసముంటున్న వాచ్మెన్ కుటుంబం ప్రాణాలతో బయటపడగా.. అందులో పార్క్ చేసిన వాహనాలు నీటమునిగాయి. జలమండలి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ స్థానికులు మండిపడ్డారు. విషయం తెలుసుకున్న స్థానిక భాజపా నాయకులు ఘటనాస్థలానికి చేరుకుని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజాము నుంచి అపార్ట్మెంట్ వాసులు బయటకు రాలేని స్థితిలో ఉండగా.. వారికి కనీసం మంచి నీరు, పాలు లాంటి నిత్యావసరాలను అందించలేని స్థితి ప్రభుత్వాధికారులు ఉన్నారని ఆరోపించారు.
ఇదీ చూడండి: రాయలసీమ ఎత్తిపోతాలు ఆపాలని కోరిన తెలంగాణ సర్కారు