నిన్నే ప్రేమిస్తున్నాను...పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ప్రియురాలిని మోసం చేయడమే కాకుండా వేరొక యువతిని పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడిని ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా డెంకాడ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్పీ రాజకుమారిని... బాధితురాలు ఆశ్రయించడం వల్ల ఈ విషయం బయటపడింది. గురువారం రాత్రి డెంకాడ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేసి 24 గంటల్లోపే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఎస్పీని ఆశ్రయించిన బాధితురాలు
ఈ కేసుకు సంబంధించిన వివరాలను భోగాపురం సీఐ సీహెచ్ శ్రీధర్, ఎస్‌ఐ ఎస్.భాస్కరరావు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాలపాలేనికి చెందిన కముజు బాలాజి(30)... శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద ఉన్న అరవిందో ఫార్మా పరిశ్రమలో చేరి 2016 నుంచి 2019 వరకు పని చేశాడు. ఆ సమయంలో అక్కడ ఆ యువతి తల్లి క్యాంటీను నిర్వహించేది. అలా పరిచయం ఏర్పరచుకొని డెంకాడ ప్రాంతంలో ఉన్న ఆమె ఇంటికి వెళ్తుండేవాడు. ఒకే కులానికి చెందిన వారు కావడం వల్ల ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని నమ్మించి లోబర్చుకున్నాడు. ఆ తర్వాత విశాఖ జిల్లా పరవాడ వద్ద ఫార్మా పరిశ్రమకు బదిలీ కావడం వల్ల అక్కడికి వెళ్లిపోయాడు. నాలుగు నెలల క్రితం నక్కపల్లి ప్రాంతానికి చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలియడంతో తాను మోసపోయానని, న్యాయం చేయాలంటూ బాధితురాలు ఎస్పీని ఆశ్రయించింది.
రిమాండ్ కు నిందితుడు
ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన డెంకాడ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలా యువతులెవ్వరూ మోసపోకూడదనే ఉద్దేశంతో నిందితునిపై రౌడీషీట్ తెరిచినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. దిశ చట్టం మాదిరిగానే కేసులు పెట్టి బాధితురాలికి న్యాయం చేస్తామన్నారు. పెళ్లి పేరుతో మోసగించిన యువకునిపై మోసం, నయవంచన, మానభంగం సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.