ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్యశాల, పరిశోధన సంస్థ.. కొత్తరకం మాస్క్(వైజర్) రూపొందించింది. యువ ఇంజనీరింగ్ బృందం సందీప్ వెంపటి, కార్తీకేశ్, ఆశిష్‌తోపాటు నేత్ర వైద్యులు వినీత్ జోషి దీని నిర్మాణంలో పాల్గొన్నారు. కరోనా చికిత్సలు అందించే వైద్యులు, సిబ్బందికి ఈ మాస్క్ చాలా ఉపయోగపడుతుందని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన సందీప్ తెలిపారు. మనకు అందుబాటులో ఉండే వస్తువులనే ఇందులో ఉపయోగించడం విశేషం. తొలుత లామినేషన్ కోసం ఉపయోగించే 150 మైక్రాన్ల ప్లాస్టిక్ షీట్‌ను తీసుకొని 3డీలో మాస్క్ నమూనాను రూపొందించారు.
మాస్క్‌ను పెట్టుకునేందుకు అవసరమైన విడి భాగాల సాయంతో ఆసుపత్రిలోనే ఈ వైజర్‌ను తయారు చేశారు. దీనికి వెనుక రబ్బర్ బ్యాండ్‌తో మాస్క్‌ను అనుసంధానించడం వల్ల ప్రత్యేకంగా తాళ్లతో కట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకసారి ముఖానికి తగిలించుకుంటే... మళ్లీ తీసేవరకు అలాగే ఉంటుంది. నుదురు నుంచి గడ్డం కిందవరకు ఈ మాస్క్ షీటు ఉంటుంది. దీంతో ఎలాంటి వైరస్ దాడి చేసే పరిస్థితి తలెత్తదు.
మామూలు మాస్క్‌లు వాడిన తర్వాత బయట పాడేస్తున్నారు. ఫలితంగా పర్యావరణ సమస్య వస్తోంది. తాజాగా రూపొందించిన వైజర్‌తో ఎలాంటి ఇబ్బంది లేదు. నిరాటంకంగా 8 గంటలపాటు వాడుకొని... తర్వాత షీట్‌ను శానిటైజర్ లేదా సబ్బు నీళ్లతో శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా ఎన్నిసార్లైనా దీనిని శుభ్రంచేసి వాడుకోవచ్చని సందీప్ పేర్కొన్నారు.
దీని ప్రాథమిక ధర రూ.50 నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 2 వేల వైజర్లను తయారు చేశామన్నారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. తమ ఆసుపత్రి వెబ్సైట్‌లో డిజైన్ పెట్టామని, దీనిపై ఎలాంటి పేటెంట్ కోరలేదన్నారు. ఎవరైనా ఈ డిజైన్ ఉపయోగించుకొని మాస్క్‌లు తయారు చేసుకోవచ్చని సూచించారు. సాయం కావాలంటే తమ ఆసుపత్రిలో సంప్రదించాలని సందీప్ వెల్లడించారు.
ఇవీ చూడండి: ఉత్తమ ఐపీఎస్‌ల జాబితాలో తెలంగాణ పోలీస్‌బాస్