Cyclone Jawad: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారింది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి ఆగ్నేయంగా 480 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. దీని కారణంగా ఉత్తరాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేటి అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి ఈదురుగాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయి. గంటకు 45 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. శనివారం ఉదయం 70 నుంచి 90 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విపత్తుల శాఖ హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తుపాను ప్రభావం కారణంగా విశాఖపట్నంలో ఇవాళ, రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు విశాఖపట్నం కలెక్టర్ తెలిపారు. విజయనగరం జిల్లాలో రెండు రోజులపాటు పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అలాగే అంగన్వాడీలకు కూడా సెలవులు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: Corona cases in telangana : విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కొవిడ్ నిర్ధరణ