లాక్‌డౌన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న దృష్ట్యా... వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పాలిహౌస్ రైతులు తమ పంట అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో వివాహాది శుభకార్యాలు లేకపోవడం, లాక్‌డౌన్ ఆంక్షలు వల్ల... జెర్పెరా, కార్నేషన్ పూలు అమ్ముకోలేక పాలీహౌసుల్లోనే వదిలేస్తున్నారు. కొందరైతే... పూలు తెంపడం, మార్కెట్‌కు తరలించడానికి అయ్యే రవాణా ఖర్చులు కూడా వృథా అని భావించి పంట పూర్తిగా తొలగించేస్తున్నారు.
మళ్లీ మొక్కలు వేసుకోవాలంటే హీనపక్షంగా 10 లక్షల రూపాయల పైమాటే. కొవిడ్-19 నేపథ్యంలో గత ఏడాది లాక్‌డౌన్ సమయం... ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది కూడా లాక్‌డౌన్ విధించడం వల్ల వరసగా రెండో ఏటా ఆర్థికంగా దెబ్బతిని లక్షల రూపాయల నష్టాల ఊబిలోకి కూరుకుపోయామని రైతులు వాపోతున్నారు. రాజధాని చుట్టుపక్కల దాదాపు అన్నీ ఊర్లలో పౌలీహౌస్ రైతుల దుస్థితి ఇదే.