ఇంట్లోవారితో వారంలో కనీసం కొన్ని నిమిషాల పాటైనా మాటలు కలపని మిలీనియల్స్ రోజంతా ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. దీంతో ఎప్పుడూ లేని విధంగా ఇంట్లోనే వారిని కొత్తగా ఆవిష్కరించుకోవాలనే ఆలోచనలో పడ్డారు. ఉరుకుల పరుగుల జీవితంలో వారేం కోల్పోతున్నారో అర్థం చేసుకుంటున్నారు. ఎలాగో తెలిస్తే మీరూ ఆలోచనలో పడతారు. అయినవాళ్ల మనసుని దోచుకుంటారు. కచ్చితంగా కరోనాకి దూరంగా ఉంటూనే మనసులో మాత్రం థ్యాంక్స్ చెప్పకనే చెబుతారు..
జరసోచో!
నవీన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. నెలకి లక్షల్లో జీతం. నాన్నేమో రిటైర్డ్ టీచర్. అమ్మేమో చిన్నప్పటి నుంచి ఇంటి మనిషే. ఎప్పుడో అర్ధరాత్రి ఇంటి బెల్లుకొడితే తలుపు తీసే నాన్న ఎన్నో సార్లు ఎదురు చూశాడు. ఒక్క మాట కోసం.. ‘ఇంకా ఎందుకు మెలకువగా ఉన్నావ్ నాన్నా. తిన్నావా?’ అవి అడుగుతాడేమోనని. ఎప్పుడూ అడిగింది లేదు. సరాసరి గదికి వెళ్లి పడుకోవడమే.
వీకెండ్‌లో అయితే తలుపు తీసే అవసరం కూడా రాదు నాన్నకి. అలాంటి నవీన్‌కి ఇప్పుడు ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. బాల్కనీనే బరిస్తా కాఫీ షాపు అనుకోవాల్సిన స్థితి. గతంలో ఎప్పుడూ అమ్మ పెట్టిన కాఫీని వేడిగా తాగింది లేదు. వెళ్తూ.. వెళ్తూ.. చల్లారిన కాఫీని సిప్ చేసి అక్కడే వదిలి వెళ్లే నవీన్.. అమ్మ కొంగు నుంచి సరాసరి చేతిలోకి వచ్చిన కాఫీ తాగాడు. ‘ఆహా.. ఏమి రుచి. ఇన్ని రోజులు నేను మిస్ చేసుకున్న కాఫీనా ఇది? అమ్మా.. నువ్వు సూపర్’ అని వర్క్ ఫ్రమ్ హోం స్టార్ట్ చేశాడు.
ఆ కాంప్లిమెంట్ విని ఎన్నాళ్లయ్యిందో. అమ్మ ఆనందానికి అవధుల్లేవు. బ్రేక్ టైమ్‌లో నాన్న దగ్గరికి వచ్చి ‘ఈ గేమ్ ఆడావా? భలే ఫన్ ఉంటుంది. ఒక్కసారి ఆడు నాన్నా.. ’ అని పక్కనే కూర్చున్నాడు. ఎన్నెళ్లయ్యిందో ‘ఆడుకుందాం రా నాన్నా..’ అని కొడుకు నోట విని. తండ్రి చిన్న పిల్లాడయిపోయాడు.
కొన్నిలా ప్లాన్ చేయండి..
- అమ్మకీ వంట గది నుంచి కొన్ని రోజులు సెలవు ప్రకటించండి. చెల్లి, అక్కతో కలిసి వంట చేయండి. అమ్మని కూర్చోమని మీరే వడ్డించండి.
- నాన్న ఎప్పటి నుంచో వాడే పాత కారో, బండో ఏదైనా.. శుభ్రంగా మీరే క్లీన్ చేయండి. చిన్నప్పుడు వాటితో మీకున్న అనుబంధాల్ని ఓ సారి గుర్తు చేసుకోండి.
- మీరు ధరించే ట్రెండీ ఫ్యాషన్ దుస్తుల్ని పేరెంట్స్‌ని వేసుకోమనండి. ఓ మంచి ఫొటో షూట్ చేయండి. ఆల్బమ్ తయారు చేసి ఆన్‌లైన్‌లో ప్రింటింగ్ ఇవ్వండి.
రియాన్ ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్. పదో తరగతిలో ప్రెజర్ కుక్కర్ చదువులు. ఇంటర్‌లో మైక్రోఓవెన్ కాలేజీలు. ఇంచుమించు మూడేళ్లు. మార్కులు ర్యాంకులే. అవి దాటుకుని ఇప్పుడు ఇంజినీరింగ్. ఛాన్స్ దొరికితే చాలు. ఫ్రెండ్స్‌తో షికార్లు. సినిమాలు.. టూర్లు. ఎక్కడికంటే అక్కడికి.. రియాన్ బ్యాగులు మోస్తూ.. బండిపై దింపుతూ.. తిరిగొచ్చే వాళ్ల నాన్నకి ఎప్పుడూ ఒకటే ఆలోచన. మళ్లీ నా కొడుకుతో నేను ఎప్పుడూ ఆడతానో అని. ఎప్పుడైనా భార్యతో ఆ విషయం చెబితే.. ‘చిన్న పిల్లాడిలా వాడితో ఆడాలనుకోవడం ఏంటి? వాడి ఫ్రెండ్స్ వాడికున్నారు.
ఇక మీతో ఎందుకు ఆడతాడు’ అనేది. కానీ, కొడుకుతో ఆడే క్రికెట్‌లో ఉండే మజానే వేరు. కొడుకు బౌలింగ్‌లో కావాలనే అవుట్ అయ్యి వాడి ముఖంలో ఆనందం చూసి తెగ సంతోష పడే తండ్రికి ఆ ఫీలింగ్ కోట్లు ఇచ్చినా రాదు. అలాంటి తండ్రికి కరోనా వైరస్ కొడుకుని ఇంట్లోనే ఉండమనేంత పెద్ద కారణంగా మారింది. ఏం చేయాలో తోచక.. ఫోన్‌తో బోర్ కొట్టి.. ‘నాన్నా.. ఏదో ఒకటి చెయ్యకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉంది? ఏదైనా ఆడుకుందామా?’ అనే సరికి తండ్రి నాలుగు అడుగుల్లో తన గదిలోకి వెళ్లి. ఓ బ్యాటు తెచ్చాడు.
దాన్ని చూసిన రియాన్ షాక్ అయ్యాడు. ఆ క్రికెట్ బ్యాటు తన ఆరో తరగతిలో కొన్నది. ‘ఇది నీకు గుర్తుందా?’ అని నాన్న అడిగిన మరుక్షణం.. ‘తన జ్ఞాపకాల్లో.. ఓ క్రికెట్ కోచ్ కనిపించాడు. ఇలా ఆడు కన్నా.. అలా బౌలింగ్ చెయ్ చిన్నూ..’ అంటూ అప్పుడూ ఇదే నాన్న. ఏ మాత్రం మారలేదు.
కానీ, నేను మారిపోయా. మర్చిపోయా. అనుకుంటూ బ్యాటు తడిమాడు. ‘చాలా కాలంగా ఎదురు చూస్తున్నా చిన్నూ.. పదా ఆడదాం’ అంటూ భుజంపై చెయ్యి వేశాడు రియాన్ వాళ్ల నాన్న. ఆ భుజంపై చేయినీ.. నాన్న ముఖంలో ఎప్పుడో మర్చిపోయిన ఫ్రెండుని చూస్తూ కదలాడు రియాన్..
భవ్య ఫ్యాషన్ డిజైనర్. ఎప్పుడూ తనదో లోకం. స్కెచ్‌లు. డిజైన్‌లు.. ప్రదర్శనలు.. ర్యాంప్ వాక్‌లు.. ఫ్యాషన్ రంగంలో తనో ఐకాన్‌గా నిలవాలనే తపన. ఈ నేపథ్యంలో తను ఇంట్లో ఉండేదే తక్కువ. నెలల్లో రెండు మూడు రోజులు ఉన్నా.. అదే ధ్యాస. నాన్నేమో సివిల్ ఇంజినీర్. ఆయనా ఎప్పుడూ క్యాంపులే. ఇక ఇంటి పట్టునే ఉండేది అమ్మే. భవ్యపై ఎంత ప్రేమున్నా.. ఒక్క రోజు కూడా తనతో గడపమని అడిగింది లేదు.
అంతెందుకు తన ప్రోత్సాహంతోనే భవ్య ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకుంది. కూతురు ఎంచుకున్న రంగంలో ఎదగాలనుకుంది. ఇప్పుడు ప్రపంచానికొచ్చిన పిలవని విలన్ కారణంగా భవ్యతో వాళ్ల నాన్న కూడా ఇంటికే పరిమితం. ఇక అమ్మకి ఒకటే ఆనందం. అది తింటారా? ఇది తింటారా? అని వంటింట్లో ఘుమఘుమ లాండించేస్తోంది. భవ్యకి ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక వాళ్ల అమ్మ గదిలో ఉన్న పుస్తకాల్ని ఒక్కొక్కటిగా చూస్తోంది.
పుస్తకాల మధ్య నుంచి ఓ నోట్‌బుక్ కింద పడింది. తీసి చూస్తే అందులో అన్నీ ఉమెన్ ఫ్యాషన్ డిజైన్లే. షాక్ అయ్యి.. అన్నీ ఒక్కొక్కటి తిరిగేస్తూ.. వంటగది వైపు నడిచింది. బెడ్ రూమ్‌కీ, వంట గదికీ మధ్య దూరం ఓ పది అడుగులే. కానీ, ఆ అడుగులు అమ్మ ఓ టైలర్ అని.. చిన్నప్పటి నుంచి తనకి అదో వ్యాపకం అనీ.. తనకి చిన్నప్పుడు కుట్టిన గౌన్లు.. అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేశాయి.
వంట గదిలో అడుగు పెట్టి వంట చేస్తున్న అమ్మని చూసింది. ఆమె ధరించిన చీర, దానిపై ఉన్న వర్క్‌ని గమనించింది. చిన్నబోయింది. అమ్మని ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన ఇల్లాలిగానే చూసినందుకు సిగ్గు పడింది. వెనకే వెళ్లి కౌగిలించుకుంది. ‘ఏంటే ఆకలేస్తోందా? ఇదిగో ఒక్క నిమిషం..’ అంటూ అంట్లు తోముతోంది అమ్మ..
ఫ్రెండ్స్.... కరోనా కీడుని మోసుకొచ్చినా.. అందరం కలిసి ఆనందించేందుకు సమయాన్నీ తీసుకొచ్చింది. కలిసి మెలిసి జీవితాన్ని ఆస్వాదిద్దాం.. ధైర్యంగా వైరస్‌ని తరిమికొడదాం.
ఇదీ చూడండి: ఆపరేషన్ కరోనా: ఇరాన్ నుంచి భారత్‌కు మరో 275 మంది