ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 2013లో ‘డయల్-100’ సదుపాయాన్ని ప్రారంభించింది. అయితే అప్పట్లో పోలీసు వాహనాల సంఖ్య తక్కువగా ఉండటంతో బాధితులకు సరైన సేవలు అందేవి కావు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖకు భారీగా నిధులు సమకూర్చింది. ఈ నిధులతో ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఓ గస్తీ వాహనాన్ని కేటాయించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గస్తీ నిర్వహించేందుకే 1500 ద్విచక్రవాహనాలు, 800 కార్లు ఉన్నాయి. ఆపదలో ఉన్న వారు డయల్-100కు ఫోన్ చేస్తే సమీపంలో ఉన్న గస్తీ వాహనం అక్కడికి చేరుకొని అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా ఆపదలో ఉన్న వారు ఫోన్ చేస్తే.. వారు కచ్చితంగా ఎక్కడున్నారో ప్రస్తుతం తెలుసుకునే వెసులుబాటు లేదు.
నిర్ధారించుకున్న తర్వాతే..
ఈ కారణంగా కంట్రోల్‌రూం సిబ్బంది ఫోన్ చేసిన వారిని అనేక ప్రశ్నలు అడిగేవారు. ఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్నారు, ల్యాండ్‌మార్క్ ఏంటీ, చుట్టుపక్కల ఏమున్నాయి.. అంటూ వారు ఎక్కడున్నారో తెలుసుకునే వరకూ ఇలాంటి ప్రశ్నల పరంపర కొనసాగేది. దీనికి ఐదు నుంచి పది నిముషాల సమయం పట్టేది. బాధితులు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో నిర్ధారించుకున్న తర్వాతే ఆ సమీపంలోని పోలీస్‌స్టేషన్ సిబ్బందిని, గస్తీ బృందాన్ని అప్రమత్తం చేసేవారు. వారు ఆ ప్రాంతానికి చేరుకోవడానికి మరికొంత సమయం పట్టేది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగేది. ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకున్న అధికారులు.. బాధితుల వద్దకు సత్వరం చేరుకునేలా ఎల్‌బీఎస్‌ను అందుబాటులోకి తెచ్చారు.
జీపీఎస్ సదుపాయం లేకపోయినా..
బాధితులు డయల్-100కు ఫోన్ చేయగానే జీపీఎస్ విధానం ద్వారా.. వారు ఎక్కడున్నారు, సమీపంలో గస్తీ వాహనాలు ఎంత దూరంలో ఉన్నాయి అన్న వివరాలు కంట్రోల్ రూంలోని తెరపై కనిపిస్తాయి. వెంటనే సమీపంలోని గస్తీ వాహనానికి బాధితుల ఫోన్‌కాల్‌ను అనుసంధానం చేస్తారు. దీంతో ఆ వాహనంలోని ట్యాబ్.. బాధితులు ఉన్న ప్రదేశాన్ని మ్యాప్ ద్వారా సూచిస్తుంది. ఇలా క్షణాల్లోనే పోలీసులు బాధితులు ఉన్న ప్రాంతానికి చేరుకుని నేరాన్ని నిలువరించే అవకాశమూ కలుగుతుంది. అప్పటికే నేరం జరిగి ఉంటే నేరస్థులను సత్వరమే పట్టుకునే వీలు ఉంటుంది. బాధితుల ఫోన్లో జీపీఎస్ సదుపాయం లేకపోయినా, ఆఫ్ చేసి ఉన్నా వారెక్కడున్నారో తెలుసుకునే వెసులుబాటూ ఎల్‌బీఎస్‌తో కలుగుతుంది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ పరిజ్ఞానం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
ఇవీ చూడండి: 'రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు'