Drunk and Drive : మద్యం తాగి కార్లు, బైకులు, ఆటోలు, బస్సులు, లారీలు నడిపేవారూ.. ఇకపై జాగ్రత్త.. పోలీసులకు చిక్కితే మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుంది. రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు దీన్ని అమలు చేయనున్నారు. ఇకపై డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కిన వారి వివరాలు కోర్టుకు సమర్పించి లైసెన్స్ రద్దు ఉత్తర్వులను రవాణాశాఖకు పంపించనున్నారు. మద్యం మత్తులో ప్రమాదాలు పెరుగుతుండడంతో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలనూ పెంచనున్నారు.
భవిష్యత్తుకు ఇబ్బంది : 'మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడితే భవిష్యత్తులో చాలా కష్టాలొస్తాయి. కోర్టులో ప్రతి కేసూ నమోదవుతుంది. జైలుకు వెళ్తే ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. విద్యార్థులు, యువకులకు ఉద్యోగావకాశాలప్పుడు ఈ కేసులు ప్రతిబంధకాలవుతాయి. విదేశాలకు వెళ్లేందుకు వీలుండదు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే లైసెన్స్ తాత్కాలికంగా రద్దవుతుంది. తీవ్రత ఆధారంగా శాశ్వతంగానూ రద్దవ్వొచ్చు.' -- ఏవీ రంగనాథ్, సంయుక్త కమిషనర్(ట్రాఫిక్)
మైనర్లూ... బండి నడిపితే అంతే... 'రాజధానిలో బైకులు.. కార్లు వేగంగా నడుపుతూ వెళ్తున్న మైనర్లపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. జూబ్లీహిల్స్‌లోని బాలికపై సామూహిక అత్యాచార ఉదంతంలో మెర్సిడెస్ బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపారని నిర్ధారణ కావడంతో వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు మోటారు వాహన చట్టం ప్రకారం వారి తల్లిదండ్రులనూ జైలుకు పంపించనున్నారు. కార్లను వేగంగా నడిపి ప్రమాదాలు చేయడంతో పాటు కిడ్నాప్‌లు.. అత్యాచార యత్నాలకు కార్లు వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడినా.. సీసీకెమెరాలకు చిక్కినా వారిపై కేసులు నమోదు చేయనున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 14 ఏళ్ల పిల్లలూ కార్లు, బైకులు నడుపుతున్నారన్న సమాచారంతో సంయుక్త కమిషనర్(ట్రాఫిక్) ఏవీ రంగనాథ్ పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇలాంటి ఘటనలపై చట్టపరంగా వ్యవహరించాలని, మైనర్లపై కోర్టుల్లో అభియోగపత్రాలు సమర్పించాలని ఆదేశించారు.