లష్కర్ బోనాల(Lashkar Bonalu)సంబురం అంబరాన్నంటింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో.. తెల్లవారుజాము 4 గంటలకే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ప్రభుత్వం తరఫున తొలిబోనం సమర్పించారు. భక్తులు వేకువజామునే అమ్మవారికి బోనమెత్తి ఆలయానికి పోటెత్తారు.
కోవెలలో కోలాహలం..
శివసత్తులు పూనకాలు, పోతరాజుల విన్యాసాలతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలంతా ఉదయాన్నే పట్టుచీరలు కట్టుకుని ముత్తైదువుల్లా అలంకరించుకుని బోనమెత్తి అమ్మవారి ఆశీర్వాదం కోసం తరలివచ్చారు. పిల్లాపెద్దలతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.
పకడ్బందీ ఏర్పాట్లు..
ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల ఏర్పాట్లు చేసింది. 2వేల 500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా ప్రముఖులు ఇవాళ మహంకాళి(Lashkar Bonalu)ని దర్శించుకోనున్నారు. ఉత్సవాల్లో ప్రజలు కరోనా జాగ్రత్తలు మరవొద్దని....అందరూ తప్పక మాస్క్ ధరించాలని మంత్రి తలసాని సూచించారు. కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
సుఖశాంతులతో.. సుభిక్షంగా..
" రైతాంగం పాడిపంటలతో.. సుఖసంతోషాలతో.. సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కుకున్నాను. ఈ ఏడు వర్షాలతోనే పండుగ మొదలవడం శుభసూచకం. మధ్యాహ్నం పొట్టేళ్ల ఊరేగింపు.. సాయంత్రం ఫలహారాల ఊరేగింపు ఉంటుంది. భక్తులు, శివసత్తులు, పోతురాజులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర ప్రజలంతా అమ్మవారిని దర్శించుకుని.. కరోనా మహమ్మారి తొలగిపోవాలని కోరుకోండి."
- తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి
కరోనాను అమ్మ తొలగిస్తుంది..
"సికింద్రాబాద్లో కలరా వచ్చినప్పుడు ఓ వ్యక్తి ఉజ్జయినిలో అమ్మవారిని దర్శించి.. కలరా తగ్గితే సికింద్రాబాద్లో ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నారు. అలా మొక్కుకోగానే ఇక్కడ ఆ వ్యాధి తగ్గింది. ఆ వ్యక్తి మొక్కు ప్రకారం.. ఈ గుడిని కట్టించారు. అప్పట్లో కలరాను తగ్గించిన అమ్మవారు.. ఇప్పుడు కరోనాను కూడా తగ్గిస్తారు. ఇది నా నమ్మకం. ప్రజలంతా కూడా అమ్మవారినే నమ్ముకుంటున్నారు. అందుకే కరోనా భయమున్నా.. అమ్మను దర్శించుకోవడానికి తరలివస్తున్నారు."
- భక్తురాలు