రుణాలపై కేంద్ర ఆర్థికశాఖ పెట్టిన మెలికతో సాగునీటి ప్రాజెక్టుల పనులపై ప్రభావం పడింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు, వివిధ కార్పొరేషన్ల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఆయా పనులకు చెల్లింపులు జరిపేది. కేంద్ర నిర్ణయం కారణంగా ఇపుడా ప్రక్రియలో జాప్యం అనివార్యమవుతోంది. ప్రతి ఆర్థిక సంవత్సరం బ్యాంకు రుణాలు, రాష్ట్ర ఖజానా నుంచి గుత్తేదారులు చేసిన పనుల బిల్లులు, భూసేకరణ, పునరావాసం తదితరాలకు సగటున నెలకు రూ.2000 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేసేది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు చెల్లింపులు రూ.670 కోట్లు మించలేదు. ఇందులో రాష్ట్ర ఖజానా నుంచి రూ.183 కోట్లు, బ్యాంకుల నుంచి రూ.487 కోట్ల చెల్లింపులు జరిగాయి. కాళేశ్వరం సహా మరికొన్ని ప్రాజెక్టులకు ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నుంచి నిధులు విడుదల కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. అనేక ప్రాజెక్టుల్లో రెండు నెలల్లో చెల్లింపులు ఏమాత్రం జరగనేలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేసి బ్యాంకుల కన్సార్షియం నుంచి ప్రభుత్వం భారీగా రుణాలు తీసుకొంది. సీతారామ ఎత్తిపోతల, కంతనపల్లి, దేవాదుల, శ్రీరామసాగర్ వరదకాలువ తదితర ప్రాజెక్టులకు రుణం కోసం మరో కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను కాళేశ్వరం కార్పొరేషన్‌లో భాగం చేసింది. బ్యాంకులతోపాటు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, నాబార్డుల నుంచీ రుణాలు తీసుకొంది. గత ఏడాది కేంద్రం బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌లో కాళేశ్వరం అదనపు టీఎంసీ పనిని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొంది. దీంతో బ్యాంకులు, కార్పొరేషన్లు కొంతకాలం రుణాలను నిలిపినా మళ్లీ చెల్లించాయి. ఈ ఏడాది మార్చి వరకు చెల్లించినా, బడ్జెటేతర రుణాలను కూడా బడ్జెట్‌లో భాగంగానే చూపాలని, రెండూ కలిపి ఎఫ్.ఆర్.బి.ఎం. నిర్ణయించిన పరిధి దాటకూడదని కేంద్రం పేర్కొనడంతో కొత్త సమస్య తలెత్తింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సర్కారుతో సంప్రదింపులు జరుపుతోంది.
ముందుకు సాగేదెలా..?
బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి రుణాలు రాకపోతే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు లక్ష్యానికి అనుగుణంగా ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఏప్రిల్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రూ.700 కోట్ల బిల్లులు బ్యాంకుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసలు చెల్లింపే జరగలేదు. దాదాపు మిగిలిన ప్రాజెక్టుల పరిస్థితీ ఇంతే. రాష్ట్ర బడ్జెట్, బ్యాంకుల నుంచి తీసుకొనే రుణం కలిపి ఈ ఏడాది సైతం సుమారు రూ.20వేల కోట్లకు పైగా ఖర్చుచేయాల్సి ఉండగా, మొదటి రెండునెలలు వెచ్చించింది చాలా తక్కువ. మరోవైపు ప్రభుత్వం మార్జిన్ మనీ కింద రూ.2500 కోట్లు చెల్లించాల్సి ఉంది. భూసేకరణకు రూ.1450 కోట్లు, పునరావాసానికి రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రుణాలిచ్చేందుకు బ్యాంకులు చేసుకొన్న ఒప్పందాలు అమలుచేయకపోతే సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రభావం పడే అవకాశం ఉంది.