Stipends delay for Telangana Students: రాష్ట్రంలో బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఉపకారవేతనాలు, బోధన ఫీజుల బకాయిలు రూ.3,289 కోట్లకు చేరాయి. వీటిని చెల్లించేందుకు సంక్షేమశాఖల్లో నిధుల లోటు వేధిస్తోంది. బకాయిలు లేకుండా ఫీజులు చెల్లించేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించకపోవడంతో ఏటా ఈ కష్టాలు తప్పడం లేదు. తదుపరి ఏడాది బడ్జెట్ నిధులను సర్దుబాటు చేసి, విడుదల చేస్తుండటంతో కోర్సు పూర్తయిన రెండేళ్లకు కాని విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకారవేతనాలు మంజూరు కావడం లేదు.
రాష్ట్రంలో సంక్షేమ విద్యార్థులకు 2020-21 విద్యాసంవత్సరానికి రూ.889 కోట్లు, 2021-22 ఏడాదికి రూ.2400 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దరఖాస్తులను సంక్షేమశాఖలు పరిష్కరించినప్పటికీ ఉపకారవేతనాల బడ్జెట్ నిధులు నిండుకోవడంతో 2022-23 ఏడాదిలో విడుదలయ్యే బడ్జెట్ నిధుల కోసం ఆయా శాఖలు ఎదురుచూస్తున్నాయి.
బడ్జెట్లో బకాయిల ఊసే లేదు: బోధన ఫీజులు, ఉపకారవేతనాల కోసం రాష్ట్రంలో ఏటా 12.50 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖల్లో ప్రత్యేక అభివృద్ధి నిధులు అందుబాటులో ఉండటంతో ఫీజులు సకాలంలో విడుదలవుతున్నాయి. బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజులను తదుపరి ఏడాది బడ్జెట్ నిధుల నుంచి చెల్లిస్తున్నారు. ఆయా సంక్షేమశాఖల్లో ఉపకారవేతనాలకు బడ్జెట్ డిమాండ్లు రూపొందించడంలో బకాయిలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వేల కోట్లకు చేరిన బకాయిలు: 2020-21 ఏడాదికి బీసీ సంక్షేమశాఖలో విద్యార్థులందరికీ బోధన ఫీజులు చెల్లించేందుకు రూ.620కోట్లు అవసరమని అంచనా. విద్యార్థుల దరఖాస్తులు పరిష్కరించినప్పటికీ నిధులు నిండుకున్నాయి. మైనార్టీ, ఈబీసీ కేటగిరీ విద్యార్థులదీ ఇదే పరిస్థితి. ఏటా ఈ సంక్షేమశాఖల విద్యార్థులకు ఫీజులు ఆలస్యమవుతున్నాయి. ఓవైపు 2020-21 ఏడాదికి రూ.889 కోట్ల ఫీజు బకాయిలు ఉంటే, 2021-22 ఏడాదికి ఎస్టీ సంక్షేమశాఖ రూ.60కోట్లు మినహా మిగతా విభాగాలు ఫీజులు మంజూరు చేయలేదు. విద్యార్థుల ఖాతాల్లోనే బోధన ఫీజులు జమ చేయాలన్న షరతుతో ఇప్పటికే కేంద్రం నుంచి రూ.250కోట్ల నిధులు నిలిచిపోయాయి. 2021-22ఏడాదికి ఉపకారవేతనాలు, బోధన ఫీజుల డిమాండ్ రూ.2,400కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ లెక్కన విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ.3,289కోట్లకు చేరుకుంది.
ఇదీ చదవండి: బంజారాహిల్స్ పబ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. వారిని అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు!