పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో మరో 25 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చాయి.
కేటీఆర్‌కు వైద్య పరీక్షలు..
హబ్సీగూడ డివిజన్ రాంరెడ్డి నగర్, సంతోశ్‌నగర్ డివిజన్, రామంతాపూర్ పటేల్‌నగర్, జవహర్‌నగర్ డివిజన్ మాదన్నపేటలో బస్తీ దవాఖానాలను పురపాలక మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌అలీ, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రజలంతా బస్తీ దవాఖానా సేవల్ని విరివిగా వినియోగించుకోవాలని కేటీఆర్ సూచించారు. సరిపడా వైద్యసిబ్బంది సహా ఔషధాల్ని సకాలంలో అందించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. పలుచోట్ల రక్తపోటు, చక్కెర పరీక్షలు చేయించుకున్నారు.
గన్‌ఫౌండ్రీలో..
పేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలందించే సంకల్పంతో సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి గన్‌ఫౌండ్రీ ఘడిఖానాలో బస్తీ దవాఖానాను ప్రజలకు అంకితమిచ్చారు. దశల వారీగా 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు అమాత్యులు వివరించారు.
సనత్‌నగర్ డివిజన్ అశోక్ కాలనీలో బస్తీ దవాఖానాను ఉపసభాపతి పద్మారావుగౌడ్ ప్రారంభించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా బస్తీ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. దశలవారీగా 300 ఆస్పత్రులను జీహెచ్ఎంసీ పరిధిలోనే అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు.
మిగిలిన చోట్ల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. ఒక్కో ఆస్పత్రిలో ఒక వైద్యుడు, నర్సు, ఒక సహాయకుడు ఉండేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలు అందిస్తారు. తాజాగా ప్రారంభించిన వాటితో కలిపి గ్రేటర్ పరిధిలో 195 బస్తీ దవాఖానాల ద్వారా సుమారు 20 వేల మంది వైద్య సేవలు పొందే వీలవుతుంది. రాబోయే రోజుల్లో ప్రతీ వార్డుకు రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది.
ఇవీచూడండి: హైదరాబాద్‌కు హెరిటేజ్ గుర్తింపు వచ్చేలా కృషిచేస్తా: కేటీఆర్