కేంద్రంలో రాబోయేది కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వమేనని.. కాంగ్రెస్, భాజపాయేతర నేతే ప్రధాని అవుతారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఉద్ఘాటించారు. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన ఆయన కేంద్రంలో తెరాస నిర్ణయాత్మక పాత్రలో ఉంటే వెంటనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని పేర్కొన్నారు. ఏపీలో ఎవరు గెలుస్తారో అక్కడి ప్రజలు నిర్ణయిస్తారని.. ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రిటైర్మెంట్ తప్పదని జోస్యం చెప్పారు.
భాజపా పట్టు కోల్పోయింది
భాజపాకు ఉత్తరాదిన బలం తగ్గిందని.. దక్షిణాదిన పట్టు కోల్పోయిందని ఎద్దేవా చేశారు. ఉద్యమాల ప్రభావం ఉన్న తెలంగాణలో కమలం ఎప్పటికీ పుంజుకోలేదన్నారు. కాంగ్రెస్ కనీసం ఇరవై సీట్లు వచ్చే ఒక్క రాష్ట్రం పేరు చెప్పే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
16 స్థానాలు గెలుస్తాం
పార్లమెంటు ఎన్నికల్లో తెరాస 16 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 50 శాతం మంది తెరాసకు ఓట్లేశారని అన్నారు. వివిధ పార్టీ నాయకుల చేరికతో తమ బలం మరింత పెరిగిందని తెలిపారు. రైతులు, పేదలు, బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు తమను గెలిపించారని.. వారంతా ఇప్పటికీ తమ వెంటే ఉన్నారని పేర్కొన్నారు.
భాజపా చేసిందేమి లేదు
తెలంగాణకు భాజపా చేసిందేమి లేదని కేటీఆర్ విమర్శించారు. నిజామాబాద్‌లో రైతుల నామినేషన్లతో పసుపు బోర్డు హామీ ఇస్తున్నారని అన్నారు. దేశ వ్యాప్తంగా 300 సీట్లు సాధిస్తామన్న భాజపా నాయకులు తెలంగాణలో సాధించే మూడు సీట్ల పేర్లు చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్రంలో భాజపా పరాజయానికి బాధ్యత వహించి లక్ష్మణ్ రాజీనామా చేయాల్సిందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
వివిధ కారణాల వల్ల కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయామని కేటీఆర్ తెలిపారు. టికెట్ ఆశించి దక్కకపోతే ఆరోపణలు చేయడం జితేందర్‌రెడ్డి, వివేక్ వంటి వారికి తగదని... పార్టీకి విధేయులుగా ఉన్నవారిని తగిన విధంగా గౌరవించుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : "కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 'చౌకీదార్' జైలుకే"