రెండు తెలుగు రాష్ట్రాలకు తాగు, సాగునీటి అవసరాల కోసం నీటివిడుదల ఉత్తర్వులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు జారీ చేసింది. ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఇరు రాష్ట్రాల నీటి విడుదలకు అనుమతిచ్చింది. గురువారం జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం, త్రిసభ్య కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ ఎక్కువ వాడింది..
ఈ ఏడాది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ 449, తెలంగాణ 101 టీఎంసీల నీటిని వినియోగించుకున్నాయి. ఏపీకి బోర్డు కేటాయించిన జలాల కంటె 147 టీఎంసీలను అధికంగా వినియోగించుకొంది. 2019 డిసెంబర్ నెలాఖరు వరకు శ్రీశైలంలో మొత్తం నీరు 162 టీఎంసీలు ఉండగా... నాగార్జున సాగర్‌లో 257 టీఎంసీలు ఉంది. కనీస నీటి వినియోగ మట్టమైన శ్రీశైలంలో 834 అడుగుల వరకు 53 టీఎంసీలు, సాగర్‌లో 510 అడుగుల వరకు 131 టీఎంసీల నీరు ఉంది.
నీటి వినియోగానికి అనుమతులు
కనీస నీటి వినియోగ మట్టానికి ఎగువన శ్రీశైలంలో 108, సాగర్‌లో 125 టీఎంసీల నీరు ఉంది. అందులో నుంచి ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలకు బోర్డు అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు 84 టీఎంసీల నీరు కేటాయించింది. పోతిరెడ్డిపాడుకు నాలుగు, హంద్రీనీవా-ముచ్చుమర్రి ఎత్తిపోతలకు 18 టీఎంసీలు ఇవ్వగా... సాగర్ ఎడమ కాల్వ ద్వారా 20, కుడి కాల్వ ద్వారా 42టీఎంసీల నీటి వినియోగానికి అనుమతులు ఇచ్చారు.
మిషన్ భగీరథకు 45 టీఎంసీలు
తెలంగాణకు 140 టీఎంసీల నీరు కేటాయింపులు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు 20 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వకు 75 టీఎంసీలు ఇచ్చారు. ఏఎమ్మార్పీ, హైదరాబాద్ జలమండలి, మిషన్ భగీరథకు 45 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతి ఇచ్చారు.
ఇదీ చూడండి: పోలీస్ చేతిలో లాఠీ బదులు ఇటుక..!