జహంగీర్‌పీర్ దర్గాను 50కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్టు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. దర్గా అభివృద్ధి, అజ్మీర్‌లో రుబాత్, నాంపల్లిలో అనీసుల్ గుర్భా నిర్మాణాలపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత జహంగీర్‌పీర్ దర్గాను సందర్శించి మొక్కు చెల్లించుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అప్పట్లో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు జహంగీర్‌పీర్ దర్గాను 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దర్గా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దటంతోపాటు.. భక్తుల సౌకర్యార్థం షెడ్లు, వంట, భోజనాల గదులు, పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు.
రాజస్థాన్‌లోని అజ్మీర్‌ఖాజా మొయినుద్దీన్ ఛిస్తీ దర్గా వద్ద తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల కోసం తలపెట్టిన రుబాత్ నిర్మాణానికి ఎదురైన అడ్డంకుల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి రాజస్థాన్ వెళ్లి వచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద 20కోట్ల రూపాయలతో నిర్మాణంలో ఉన్న అనీసుల్‌గుర్భా పనులను వేగవంతం చేయాలన్నారు.
సమావేశానికి పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ దామోదర్ గుప్తా, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సలీం, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం, వక్ఫ్ బోర్డు సీఈఓ ఖాసీం, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.
ఇదీ చూడండి: ఆర్థిక నష్టం, యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై సీఎం సమీక్ష