మున్సిపాలిటీ సభ్యులు రకరకాల పార్టీల నుంచి గెలిచినప్పటికీ ప్రజలకు సేవ చేసే విషయంలో అందరూ ఒకే కుటుంబ సభ్యులుగా సమన్వయంతో పని చేయాలన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. సోమవారం జరిగిన మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం ఆయన 18 పారిశుద్ధ్య వాహనాలను ప్రారంభించారు.
మున్సిపల్ చైర్ పర్సన్ మల్రెడ్డి అనురాధ అధ్యక్షతన జరిగిన సమావేశం తుర్కయంజాల్ మున్సిపాలిటీ కార్యాలయంలో కాకుండా.. రాగన్నగూడ వార్డు కార్యాలయంలో నిర్వహించారు. దీనిపై ఆగ్రహించిన స్థానికులు, తుర్కయంజాల్ వార్డు కౌన్సిలర్లు ఆందోళన నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయాన్ని తుర్కయంజాల్లోనే కొనసాగించాలని కమిషనర్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. మున్సిపాలిటీ కార్యాలయం ఇక్కడే కొనసాగేలా చర్యలు తీసుకుంటానని వారిని శాంతింపజేశారు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గుండ్లపల్లి హరితకు కుర్చీ వేయకుండా కావాలనే తమని అగౌరవపరిచారని ఆమె భర్త ధనరాజ్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.