kitchen Budget Increased: కందిపప్పు ధర నెలలోనే కిలోకు రూ.10 వరకు పెరిగింది. వంట నూనెల ధరలు దిగొస్తున్నాయంటున్నా.. జనవరి ముందు నాటి స్థాయికి చేరలేదు. మూడేళ్ల కిందటితో పోలిస్తే 92% పైగా అధికంగా ఉన్నాయి. పప్పుల ధరల్లోనూ 20% పైనే పెరుగుదల నమోదైంది. బియ్యం ధరా రెండు నెలల కిందటితో పోలిస్తే కిలోకు రూ.3 వరకు పెరిగిందని వ్యాపారులే చెబుతున్నారు.
టూత్‌పేస్టు, సబ్బులు, టీ, కాఫీ పొడి తదితర నిత్యావసరాలు కూడా తెలియకుండానే జేబుకు చిల్లు పెడుతున్నాయి. కిలో గోధుమపిండిపై నెల రోజుల్లోనే సగటున రూ.5 నుంచి రూ.8 వరకు పెరిగింది. మూడేళ్ల కిందటితో పోలిస్తే వంటగ్యాస్ ధర 63% అధికమవడం వంటింటి మంటను మరింత పెంచుతోంది.
కందిపప్పు.. కలవరం: జులై రెండో వారం నుంచి కందిపప్పు ధర పెరగడం మొదలైంది. సాధారణ రకాలు రూ.90, నాణ్యత కలిగిన రకం రూ.98 వరకు ఉండేది. గతేడాది నిల్వలు అడుగంటడంతో ధరలు ఎగబాకాయి. ప్రస్తుతం కిలో కందిపప్పు ధర రూ.115 నుంచి రూ.120 మధ్య పలుకుతోంది. చిన్న పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కిలో రూ.125 పైన కూడా విక్రయిస్తున్నారు.
* ప్రస్తుత ఖరీఫ్‌లో కంది సాగు తక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా 1.18 కోట్ల ఎకరాల సాధారణ విస్తీర్ణం ఉండగా.. జులై నెలాఖరుకు 90.27 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కంది అధికంగా సాగయ్యే మహారాష్ట్ర, కర్ణాటకల్లో భారీ వర్షాలతో పంట దెబ్బతింది. ఆగస్టు 10 నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ గతేడాది కంటే సాగు 5.50 లక్షల ఎకరాలు తగ్గింది. ఉత్పత్తి పడిపోతుందనే అంచనాలతో కేంద్రం నిల్వలపై దృష్టి పెట్టింది. రోజువారీ వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
మినుము, పెసరా అదే దారి: మినపగుళ్ల ధరలు రెండేళ్ల నుంచి కిలో రూ.100 నుంచి రూ.140 మధ్య కదలాడుతున్నాయి. కిందకు దిగిరావడం లేదు. సాగు తగ్గడం, భారీవర్షాలతో దిగుబడులు అంతంతమాత్రంగా ఉండటమూ దీనికి కారణమని చెబుతున్నారు. 2020 నాటితో పోలిస్తే మినుము సాగు కూడా దేశవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల తగ్గింది. పెసరపప్పు కూడా కిలో రూ.100- రూ.110 నుంచి దిగి రావడం లేదు.
వంటనూనె సలసల: కొవిడ్ నుంచి వంట నూనెల ధరలు మంట పెడుతూనే ఉన్నాయి. దీనికితోడు ఉక్రెయిన్- రష్యా యుద్ధం సమయంలో ఒక్కసారిగా ఎగిశాయి. ఫిబ్రవరి చివరిలో రెండు రోజుల్లోనే లీటరుపై రూ.20పైగా పెంచారు. అప్పటికే ఉన్న నిల్వలపైనా ఎమ్మార్పీ ధరలు సవరించి ఎక్కువ ధరకే అమ్మేశారు. తర్వాత కేంద్రం తీసుకున్న చర్యలతో కొంతమేర దిగొచ్చాయి. అయినా కొవిడ్ పూర్వస్థాయికి వంటనూనెల ధరలు రాలేదు.
పేద, మధ్యతరగతి వర్గాల వంటింటి బడ్జెట్‌లో అధిక శాతం పెరిగినవి ఇవే. పొద్దుతిరుగుడు నూనె, పామోలిన్ పెద్దఎత్తున పెరిగాయి. నెలకు నాలుగు లీటర్లు వాడే కుటుంబంపై సగటున రూ.180 నుంచి రూ.240 భారం పడుతోంది. ఎండుమిర్చి ధర కూడా 100 శాతం పెరిగి కిలో రూ.280 నుంచి రూ.320 వరకు చేరింది.
జీఎస్టీ బాదుడూ కారణమే: కేంద్రం ఇటీవల ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం కూడా పేద, మధ్యతరగతి వర్గాల ఇంటి బడ్జెట్‌ను పెంచేసింది. రోజూ పెరుగు ప్యాకెట్ కొనుక్కునే కుటుంబంపై నెలకు రూ.150 వరకు అధిక భారం పడుతోంది. 25 కిలోల బియ్యం ప్యాకెట్ కొంటే రూ.60 పైగా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి. గోధుమపిండి ధరలూ కిలోకు రూ.5 నుంచి రూ.8 పైనే పెరిగాయి. బ్రాండింగ్‌తో కూడిన ప్యాకేజి ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం దీనికి ఒక కారణం. తయారీ సంస్థలు ఉత్పత్తి వ్యయం పెరిగిందంటూ.. అదనంగా మరికొంత వడ్డించాయి.
ఇవీ చదవండి: TIGER WANDERING కోటపల్లి అడవుల్లో పులి సంచారం, పశువులపై దాడి