తెలంగాణ రాష్ట్రంలో అధిక వర్షాలకు పంటనష్టం జరిగిన రైతన్నలకు పరిహారం చెల్లించాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి డిమాండ్ చేశారు. వరి పంటకు ఎకరాకు 20వేలు, ఇతర పంటలకు ఎకరాకు 30వేలు లెక్కన పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే భారీ వర్షాలకు పెద్ద ఎత్తున నష్టం సంభవించిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందానికి.. రాష్ట్రంలో జరిగిన నష్టతీవ్రతను వివరిస్తూ వినతి పత్రం అందచేసినట్లు ఆయన చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నష్టాన్ని అంచనా వేయలేదని ధ్వజమెత్తారు. ఏవైనా వైపరిత్యాలు జరిగిన వెంటనే కేంద్రానికి వివరాలను నివేదిస్తే.. కేంద్రం నుంచి వచ్చిన బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిహారం కోసం కేంద్రానికి సిఫార్సు చేస్తుంది. అయితే కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నివేదిక ఇవ్వలేదని విమర్శించారు. భాజపా, తెరాసలు వరదలను కూడా రాజకీయానికి ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్న కేసీఆర్ ప్రభుత్వం.. అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చూడండి: భాగ్యనగరంలో కిలో ఉల్లి 35 రూపాయలే...: మంత్రి నిరంజన్‌రెడ్డి