ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు ప్రతిష్ఠాత్మకంగా భావించే కనకదుర్గ వంతెన వద్ద అప్రోచ్ రహదారి విస్తరణ కాకపోవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. భూసేకరణ జరిపి జాతీయ రహదారి విస్తరణ చేయాలని రహదారులు, భవనాల శాఖ అధికారులు రాసిన లేఖలను రెవెన్యూ శాఖ పక్కన పెట్టింది. భూసేకరణ లేకుండానే వంతెన పూర్తి చేయాలని సూచించడంతో హైదరాబాద్ వైపు వెళ్లే మార్గం కుంచించుకుపోయింది. దీంతో పైవంతెనపై ట్రాఫిక్ జాం అవుతోంది. వాహనాలను విడుదల చేసిన తొలిరోజే ట్రాఫిక్ ఆగిపోయింది. రెండో రోజు కూడా అదే పరిస్థితి ఉంది. పైవంతెన ఒక పర్యాటక ప్రాంతంగా మారడంతో సెల్ఫీలు దిగేవారి సంఖ్య ఎక్కువై ట్రాఫిక్‌కు అవరోధంగా మారింది. పైవంతెన మీదుగా కృష్ణమ్మ ప్రవాహం, విజయవాడ నగరం, ఇంద్రకీలాద్రి సుందర మనోహరంగా దర్శనమీయడంతో సెల్ఫీల జోరు పెరిగింది.
భూసేకరణ లేనట్లే..!
ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కనదుర్గ పైవంతెనను శుక్రవారం కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆయన కోసం నిర్మాణం పూర్తయినా నెలరోజులు వాహనాలను వదలకుండా ఖాళీగానే ఉంచారు. నాలుగు వరసల రహదారి 5280 మీటర్ల దూరం. పైవంతెన అసలు పొడవు 1995 మీటర్లు. మిగిలిన 605 మీటర్లు అప్రోచ్ రహదారి ఉంది. కుమ్మరిపాలెం వైపు 300 మీటర్లు, రాజీవ్‌గాంధీ పార్కు వైపు సుమారు 300 మీటర్లు ఉంటుంది. రాజీవ్‌గాంధీ పార్కు వైపు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వయాడక్టు నిర్మాణం చేసిన విషయం తెలిసిందే. మొత్తం మూడు మార్గాలు ఉంటాయి. హైదరాబాద్ వైపు కుమ్మరిపాలెం వద్ద జాతీయ రహదారి నాలుగు వరసలుగా ఉంటుంది. దీంతో అక్కడ పైవంతెన ఆరు వరసలు.. పక్కన రహదారి నాలుగు వరసలు వచ్చి ఆగిపోయినట్లు ఉంటుంది. ఇక్కడ సాంకేతికంగా లోపం ఉంది. పైవంతెన నుంచి వేగంగా వచ్చే వాహనాలు.. కింద వైపు నుంచి వచ్చే వాహనాలు ఢీ కొట్టే ప్రమాదం ఉందని ఇంజినీర్లు విశ్లేషించారు. దీనికి జాతీయ రిహదారి కొంతదూరం వరకు కనీసం 500 మీటర్ల వరకు ఆరువరసలుగా విస్తరించాల్సి ఉంది. కుమ్మరిపాలెంలో భూసేకరణ చేయాల్సి ఉంది. అక్కడ దుకాణాలు ఉన్నాయి. పరిహారం రూ.కోట్లలో కావాల్సి ఉంది. దీనికి ర.భ. ఎస్‌ఈ జాన్‌మోషే ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అయితే భూసేకరణకు నిధుల సమస్య ఉండంతో భూసేకరణను పక్కన పడేశారు. రాజీవ్‌గాంధీ పార్కు వైపు వయా డక్టు దగ్గర కృష్ణా నదిలోకి రోడ్డు వెళ్లింది. అక్కడ భూపటిష్ట పరీక్షలు చేశారు. దీనికి రివిట్‌మెంట్ నిర్మాణం చేశారు. ఘాట్‌లోకి రహదారి చొచ్చుకు వెళ్లింది. ఇంద్రకీలాద్రి గుడి వద్ద నదిలో నిర్మాణం చేసిన పారా వంతెన కూడా కొంతభాగం అప్రోచ్ రహదారి నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ వాహనాలు రద్దీపెరిగింది. భూసేకరణ జరిగితేనే కుమ్మరిపాలెం వైపు ట్రాఫిక్ సజావుగా వెళ్లనుంది.
వన్‌టౌన్‌పై తగ్గిన భారం..!
కనకదుర్గ పైవంతెన ప్రారంభం కావడంతో వన్‌టౌన్‌పై ట్రాఫిక్ చాలా వరకు తగ్గిపోయింది. ఆర్టీసీ బస్సులు సైతం పైవంతెన మీదుగా వెళుతున్నాయి. కనకదుర్గ గుడి వద్ద ట్రాఫిక్ రద్దీ కనిపించలేదు. పైవంతెనపై గంటకు వెయ్యి వాహనాల వరకు నడిచినట్లు (రెండు వైపులా)అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దసరా ఉత్సవాల నేపథ్యంలో భారీ వాహనాలను దారి మళ్లించారు. కార్లు, బస్సులు ద్విచక్రవాహనాలు, ఆటోలు మాత్రమే వెళుతున్నాయి.
ఇదీ చదవండి: నిండుకుండలా నిజాంసాగర్ జలాశయం.. పోటెత్తిన పర్యాటకులు