తిరుమలకు భక్తులతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు 1977లో... చిత్తూరు జిల్లా ఏ.రంగంపేట సమీపంలో కల్యాణి డ్యాం నిర్మించారు. 12వేల ఎకరాల విస్తీర్ణంలో 900 అడుగుల నీటిమట్టంతో 31 వేల క్యూసెక్కుల నీరు నిల్వ ఉండేలా జలాశయాన్ని నిర్మించారు. 1600 అడుగుల పొడవుతో మూడు స్పిల్ వే గేట్లు ఏర్పాటు చేశారు.
దిగువకు నీటి విడుదల చేసే సమయంలో ఆ దృశ్యాలు కనులవిందుగా ఉంటాయి. నివర్ తుపాను సహా ఇటీవల భారీ వర్షాలకు జలాశయం నిండడం వల్ల ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఆ దృశ్యాలను చూసేందుకు వచ్చిన సందర్శకులు ఉల్లాసంగా గడిపామని చెబుతున్నారు.
కల్యాణి డ్యాంకు పలు సమస్యలు వెంటాడుతున్నాయి. జలాశయం వంతెనపై గుంతలు ఏర్పడ్డాయి. చాలా చోట్ల గోడలు పెచ్చులూడి దర్శనమిస్తున్నాయి. స్పిల్ వే గేట్ల నుంచి లీకేజీలు ఉన్నాయి. 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాలని.. తక్షణ మరమ్మతుల కోసం రెండు కోట్ల రూపాయలు కేటాయించాలని కోరామని.. అధికారులు చెబుతున్నారు. జలాశయం ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపర్చి పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: 'చందా వేద్దాం.. కళ్లు తెరిపిద్దాం'