తెలంగాణ ఉన్నత న్యాయస్థానానికి తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి నియమితులయ్యారు. నేడు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హైకోర్టు సీజేగా ఆమెతో ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు దిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆమె వ్యవహరించారు. దేశవ్యాప్తంగా గల హైకోర్టుల్లో ప్రస్తుతం మహిళా ప్రధాన న్యాయమూర్తి ఆమె ఒక్కరే కావడం గమనార్హం.
దిల్లీలో 1959 సెప్టెంబరు 2న జన్మించిన హిమా కోహ్లి.. దిల్లీ యూనివర్సిటీలో లా కోర్సు పూర్తి చేశారు. 1984లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. దిల్లీ హైకోర్టులో 2006 నుంచి న్యాయమూర్తిగా ఉంటూ.. అనంతరం ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది తెలంగాణకు బదిలీ అయ్యారు. నూతన సీజే ప్రమాణస్వీకారం నేపథ్యంలో.. ఉదయం10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్‌భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
పెరుగుతున్న మహిళల ప్రాతినిధ్యం
న్యాయవ్యవస్థలో మొదటి నుంచీ మహిళల ప్రాతినిధ్యం నామమాత్రమే. ఉన్నత న్యాయవ్యవస్థలో మరీ తక్కువ. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పరిమిత సంఖ్యలో న్యాయవాదులున్నా, న్యాయమూర్తుల సంఖ్య స్వల్పమే. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం.