JC Prabhakar Reddy on KTR comments: అనంతపురం జిల్లా పోలీసులు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో పనిచేస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. 2018 నాటి ప్రబోధానంద కేసులో ఇప్పటికీ అమాయకులను ఇరికిస్తున్నారన్నారు. తెదేపా కార్యకర్తలను ప్రబోధానంద కేసులో ఇరికిస్తానంటూ.. పెద్దవడుగూరు ఎస్సై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు ఆత్మసాక్షిగా పనిచేయాల్సిందిపోయి.. సజ్జల చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ వాస్తవాలే చెప్పారు: ఏపీలో సమస్యలను ప్రస్తావించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఆ వెంటనే మాటను ఎందుకు వెనక్కి తీసుకున్నారో అర్థం కావట్లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అక్షరాల కేటీఆర్ చెప్పినట్లుగా పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. మాట జారానని కేటీఆర్ చెబుతున్నా.. వాస్తవాలే మాట్లాడారని పేర్కొన్నారు. ఏపీలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై ఫొటోలు తీసి పంపటానికి తాను సిద్ధంగా ఉన్నానని.. కేటీఆర్ మాత్రం తన మాటను వెనక్కి తీసుకోవద్దని కోరారు.
ఇవీ చదవండి: '10 ఏళ్లు.. 16 లక్షల ఉద్యోగాలు.. రూ.2.5 లక్షల కోట్ల ఆదాయం'