Pawan Kalyan meeting: మత్స్యకారుల అభివృద్ధి కోసం జనసేన కృషి చేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాను మాటల వ్యక్తిని కాదని.. చేతల వ్యక్తినని చెప్పారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన మత్య్యకార అభ్యున్నతి సభలో మాట్లాడిన ఆయన.. వైకాపా సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గంగవరంలో జెట్టీ పేరుతో మత్స్యకారులను నిరాశ్రయులను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన అన్యాయానికి మత్స్యకారులు ఎదురొడ్డి పోరాడాలని పిలుపునిచ్చారు. జీవో 217 ప్రతులను చింపి పవన్ నిరసన తెలిపారు.
జైలుకు పంపినా సిద్ధమే..
మత్స్యకారుల సమస్యలను చాన్నాళ్లుగా వింటున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఏపీలో 32 మత్స్యకార కులాలు, ఉపకులాలు ఉన్నాయన్న ఆయన.. 65 నుంచి 70 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని చెప్పారు. జీవో చింపినందుకు జైలుకు పంపించినా తాను సిద్ధమేనన్నారు. దోపిడీ చేసే చట్టాలను ఉల్లంఘించాల్సిందేనని వ్యాఖ్యానించారు. జీవో 217తో లక్షలమంది పొట్టకొడుతున్నారని ధ్వజమెత్తారు.
"మరబోట్లు రాకముందు సముద్రతీరం అంతా మత్స్యకారులదే. మరబోట్లు వచ్చాక మత్స్యకారులకు అనేక సమస్యలు వచ్చాయి. లేని సమస్యను సృష్టించడంలో వైకాపా నేతలు ఉద్ధండులు. సమస్య పరిష్కారం పేరుతో మళ్లీ అనేక ఇబ్బందులు పెడతారు. మూడేళ్లలో 64 మత్స్యకార కుటుంబాలకే పరిహారం ఇచ్చారు.అమలుకాని హామీలు ఎందుకు ఇస్తున్నారని ప్రజలు నిలదీయాలి? చట్టాలు పాటించేలా ముందు వైకాపా నేతలను నిలదీయాలి. గంగపుత్రులకు ఇల్లు కట్టుకునేందుకు గతంలో రూ.70 వేలు ఇచ్చేవారు.మత్స్యకారుల కష్టాలు తీరుద్దామనే యోచన వైకాపా నేతలకు ఉందా? ప్రజాస్వామ్య సమాజంలో ఫ్యూడల్ భావాలు ఉంటే ఎలా? మీ పనులను సహనంతో భరిస్తున్నాం.. భయంతో కాదు. జీవో 217ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం"
-పవన్ కల్యాణ్, జనసేన అధినేత
వైకాపా నేతల బెదిరింపులకు జనసైనికులు భయపడరని పవన్ స్పష్టం చేశారు. ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా ఎంతో ఆలోచించి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. అక్రమ కేసులతో ఇలాగే హింసిస్తే తెగించి రోడ్డుపై నిలబడతానని హెచ్చరించారు.
"జెట్టీ నిర్మాణ పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. కొత్తవి ఇవ్వకపోగా.. ఉన్న ఉపాధి అవకాశాలనూ పోగొడుతున్నారు. ప్రోత్సహిస్తే మత్స్యకారుల నుంచి ఎందరో క్రీడాకారులు వస్తారు. మత్స్యకారుల కోసం జనసేన మేనిఫెస్టోలో ప్రత్యేక విధానాలు. కేసులు పెడతారని తెలిసే జీవో కాపీ చించా. నాపై నమ్మకం ఉంచండి.. మీకు అన్ని విధాలా అండగా ఉంటా. జీవో 217 అమలుచేస్తే క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగుతాం"
- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఇదీ చదవండి: