రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించే విషయంలో ప్రభుత్వంతో కలిసి రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఐటీసీ సంస్థను కోరారు. ఐటీసీ సంస్థ ఛైర్మన్ సంజీవ్ పూరి, ఇతర ప్రతినిధులు ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో రూ.800కోట్ల వ్యయంతో చేపట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పనులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రికి వారు వివరించారు. రెండు, మూడు నెలల్లోనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాష్ట్రంలో అతి పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను తక్కువ సమయంలోనే నిర్మించినందుకు సీఎం వారిని అభినందించారు.
సామాజిక బాధ్యతగా తీసుకొండి
వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర రావడంతో పాటు కల్తీలేని ఆహార పదార్థాలు అందించే లక్ష్యంతో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్న కేసీఆర్.. లక్ష్య సాధనకు కలిసి రావాలని ఐటీసీని కోరారు. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మహిళా సంఘాల సేవలను ముడిసరుకు సేకరణ, ఇతరత్రా అంశాల్లో వినియోగించుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ముఖ్యమంత్రి సూచించారు.
పర్యాటకంలోనూ కలిసి రండి
ములుగు జిల్లాలో ఉన్న రేయాన్స్ కర్మాగారం పునరుద్ధరణకు ఐటీసీ చొరవ చూపాలని కేసీఆర్ కోరారు. దీనికి సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. కాళేశ్వరంతో పాటు ఇతర ప్రాజెక్టులతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 500 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాలు సిద్ధమవుతున్నాయన్న ఆయన... వాటి చుట్టూ అందమైన ప్రకృతి ఆకృతి దాల్చుతున్నాయని వివరించారు. సహజ సిద్ధమైన అడవులు, చారిత్రక ప్రదేశాలు పర్యాటక కేంద్రాలుగా వెలుగొందే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలోనూ కలిసి రావాలని ఐటీసీ సంస్థను ముఖ్యమంత్రి కోరారు.
ఇదీ చూడండి: సురక్షితంగా స్వరాష్ట్రానికి తీసుకువస్తాం: కేటీఆర్