Karthika Masam Special : రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి కార్తిక పౌర్ణమి పూజలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు వేకువజాము నుంచే శివాలయాలకు పోటెత్తారు. ఆ శివయ్యను దర్శించుకుంటూ పరవశించి పోతున్నారు. ముఖ్యంగా యాదాద్రి జిల్లాలోని ఓ శివాలయానికి భక్తులు క్యూ కడుతున్నారు. ఈ శివాలయం ఈ ఒక్కరోజు మాత్రమే (కార్తిక పౌర్ణమి రోజు) తెరుచుకోవడమే ఇందుకు కారణం. ఏడాది అంతా మూసి, కేవలం కార్తిక పౌర్ణమి రోజున మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. ఆ ఆలయం యాదాద్రి భువనగిరి జిల్లాలో చిల్లాపురంలో ఉంది.
ఏ ఆలయంలోనైనా ఏడాది పొడవునా పూజలు జరుగుతాయి. కొన్నింటిలో మాత్రం కొన్ని నెలల పాటు తెరుస్తారు. ఇక్కడ మాత్రం కార్తిక పౌర్ణమి రోజు మాత్రమే తెరవడం ప్రత్యేకం. ఈ ఒక్క రోజే వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వయంభువుగా వెలసిన రామలింగేశ్వర స్వామిని కనులారా దర్శించుకుంటారు. ఇంతకీ ఈ ఆలయ చరిత్ర ఏంటి? భక్తులకు ఆ ఒక్కరోజు మాత్రమే దర్శనం ఎందుకు కల్పిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇదీ చరిత్ర : యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని చిల్లాపురం గ్రామంలోని ఓ ఎత్తైన గుట్టపై 900 ఏళ్ల క్రితం శ్రీ రామలింగేశ్వరస్వామి వెలిసినట్లు చరిత్ర చెబుతోంది. ఆ గుట్టపై రామలింగేశ్వరస్వామి స్వయంభూగా వెలసినట్లు చెబుతారు. ఆ గుట్టనే రామస్వామి గుట్టగా పిలుస్తారు. కేవలం కార్తిక పౌర్ణమి రోజున 24 గంటల పాటు మాత్రమే తెరవడం ఈ ఆలయం ప్రత్యేకత. ఇవాళ కార్తిక పౌర్ణమి కావడంతో ఆలయం తలుపులు తెరుచుకున్నాయి.
ఇక్కడ ప్రతి ఏడాది కార్తిక పౌర్ణమి రోజున జాతర జరుగుతుంది. ఈ జాతరకు ఎలాంటి ప్రచార ఆర్భాటాలు ఉండవు. అయినా సరే వేల సంఖ్యలో భక్తులు ఎత్తైన గుట్ట ఎక్కి స్వామివారిని దర్శించుకుంటారు. ఉమ్మడి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడకు తరలివస్తారు. శివ నామస్మరణతో ఆ ప్రాంతం మొత్తం మార్మోగిపోతుంది. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే ఆలయం తెరవడంతో ఈరోజు భక్తులు స్వామి సేవలో నిమగ్నమవుతారు.
తెల్లవారుజాము నుంచే పూజలు : ఈ జాతర తెల్లవారుజామున శివునికి రుద్రాభిషేక పర్వంతో ప్రారంభం అవుతుంది. గుడి పక్కనే పుట్ట ఉంటుంది. అక్కడ నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం మొక్కులు తీర్చుకుంటారు. మహిళలు ప్రత్యేకంగా 360 వత్తులతో స్వామివారికి దీపాలు వెలిగిస్తారు. పూజలు చేస్తారు. సాయంత్రం అఖండ దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాతర మొత్తం ఎంతో ఉల్లాసంగా సాగుతోంది. అంతా గుట్టవద్దకు చేరి రోజంతా సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ జాతరకు పోలీసు బందోబస్తు నడుమ కొనసాగుతుంది.
కార్తికమాసం స్పెషల్ : తెలంగాణలో ఉన్న ఈ శైవక్షేత్రాలు ఎంతో పవర్ఫుల్ - వీటి గురించి మీకు తెలుసా?
కార్తికమాసం స్పెషల్ : ఆ పుణ్యక్షేత్రాలకు తెలంగాణ ఆర్టీసీ బస్సులు - ఫ్రీగా వెళ్లొచ్చేయండి