ఐటీ వినియోగంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను మరింత బలోపేతం చేస్తున్నట్లు నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉపయోగించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహిస్తామని.. సత్ఫలితాలిస్తే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. ఆనకట్టలు, రిజర్వాయర్లు, చెరువులు, ఎత్తిపోతల నిర్వహణ కోసం వేర్వేరుగా మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని, రెండు నెలల్లో అందుబాటులోకి వస్తాయని రజత్ కుమార్ తెలిపారు.
శాఖల పునర్వ్యవస్థీకరణపై హైదరాబాద్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ అసోసియేషన్ భవన్లో ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే వానాకాలంలో కొండపోచమ్మ సాగర్ వరకు నాలుగు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇస్తామన్నారు. రాష్ట్రంలో రుతుపవనాలతో సంబంధం లేకుండా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని... జూన్ నుంచి నెలకు 10 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామని ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరాం తెలిపారు.