‘‘వరదల్లో నష్టపోయిన అన్ని కుటుంబాలకు ఆర్థిక సాయం అందాల్సిందే. ప్రతి ఇంటికి రూ.10 వేల చొప్పున సహాయం అందించండి. కూలిన ఇంటికి రూ.లక్ష, పాక్షికంగా కూలితే రూ.50 వేలు పంపిణీ చేయండి. దీనికోసం రూ.550 కోట్లను విడుదల చేస్తున్నాం.’
-ముఖ్యమంత్రి కేసీఆర్
‘‘ముఖ్యమంత్రి ఆదేశం మేరకు విడుదలైన నిధులు అర్హులకు మాత్రమే దక్కాలి. ఇందులో ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరిగినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాం’
-రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌లో వరదల్లో నష్టపోయిన సుమారు 5 లక్షల మంది బాధితులకు పరిహారం అందించడంలో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం బల్దియా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ఒక యాప్‌లో వివరాలను నమోదు చేస్తే బాధితుడి ఫోన్‌కు వన్ టైం పాస్‌వర్డ్(ఓటీపీ) వస్తుంది. దీన్ని నమోదు చేశాకే రూ.10 వేల నగదు ఇవ్వాల్సి ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లగానే స్థానిక ప్రజాప్రతినిధులు రంగప్రవేశం చేస్తున్నారు. తమ వారైన అనర్హులను బలవంతంగా నమోదు చేయించి డబ్బులు జేబులో వేసుకుంటున్నారు.
మంగళవారం రాత్రి ఓ కార్పొరేటర్ అధికారి వద్దకు వెళ్లి అతని ఫోన్‌ను తీసుకుని తమ కుటుంబికుల్లో ప్రతి సభ్యుడి పేర్లు నమోదు చేయించి డబ్బులు జేబులో వేసుకున్నారు. మరికొంతమంది పేర్లను నమోదు చేయడానికి ప్రయత్నిస్తే ఆ అధికారి వారించి వెళ్లిపోయారు. చివరకు ఆ కార్పొరేటర్ ఆ అధికారి మీదే ఆరోపణ చేసి జీహెచ్‌ఎంసీ ఉప కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా చేయించడం గమనార్హం. దీంతో అధికారులు సంబంధిత కార్పొరేటర్‌కు సర్దిచెప్పి పంపించారు. చాలా చోట్ల రూ.10 వేలకు గాను రూ.5వేలే ఇచ్చి మిగిలింది జేబులో వేసుకుంటున్నారు. అద్దెకున్న వారు నష్టపోతే యజమానులకు పరిహారం ఇస్తున్నారు. అక్రమాలపై ఆర్కేపురంలోని మంత్రి సబితారెడ్డి కార్యాలయం ముందు బాధితులు గురువారం ఆందోళన చేశారు. ఉప్పల్ బల్దియా కార్యాలయం ముందు ధర్నా చేశారు.
మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు
లాలాపేట: లాలాపేట సత్యనగర్‌లో గురువారం ఓ వివాహానికి హాజరైన మంత్రి కేటీఆర్‌ను పలువురు మహిళలు కలిశారు. ప్రభుత్వ సాయం రూ.10 వేలు అందలేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన, ప్రతి బాధిత కుటుంబానికి సాయం అందిస్తామన్నారు. శుక్రవారం కార్పొరేటర్‌తోపాటు జీహెచ్‌ఎంసీ అధికారులొచ్చి అందజేస్తారని చెప్పారు. కార్పొరేటర్ సరస్వతి, తెరాస యువజన విభాగం గ్రేటర్ అధ్యక్షుడు హరి పాల్గొన్నారు.
అడుగడుగునా అవకతవకలే..!
జగద్గిరిగుట్ట మక్దూంనగర్‌లో డబ్బులు పంచేందుకు వచ్చిన సిబ్బందే అవకతవకలకు పాల్పడ్డారు. స్థానిక నేతలతో కలిసి రెండు ఇళ్లలోని బాధితులకు కలిపి రూ.10వేలు, మరో కాలనీలో ముగ్గురికి కలిపి రూ.10వేలు ఇచ్చారు. సోమయ్యనగర్‌లోనూ బాధితులకు కాకుండా స్థానిక నేతల అనుచరులకే ఇవ్వడం గమనార్హం.
బంజారాహిల్స్ నందినగర్‌లో ఓ భవనంలో 12 గదులున్నాయి. అద్దెకుంటున్న వారిని కాదని పెళ్లయిపోయిన ఇంటి యజమాని కుమార్తెలు, బంధువుల్ని తీసుకొచ్చి ఫొటోలు తీయించి రూ.1.2లక్షల పరిహారం ఇచ్చారు.
జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు అన్ని డివిజన్లలో ఆర్థిక సాయం అందజేతలో స్థానిక నేతలు చేతివాటం చూపిస్తున్నారు. ఇదే విషయంలో బుధవారం ఓ కార్పొరేటర్‌పై కేసు నమోదు కాగా.. మిగతా డివిజన్లలోనూ అదే తంతు కొనసాగుతోంది. దసరాకు రెండురోజుల ముందే అధికార పార్టీ నాయకులు, కొందరు సిబ్బంది కలిసి తమ అనుచరులే బాధితులంటూ జాబితా తయారుచేశారు. ముందురోజు రాత్రే జాబితాలో ఉన్నవారి కుటుంబ సభ్యులు, తదితరులకు రూ.10వేలు అందజేశారు. మరుసటి రోజు ఉదయమూ అదే జాబితాలో ఉన్న మహిళల భర్తలకు మరో రూ.10వేలు అధికారికంగా అందజేశారు. అసలు బాధితులకు ఇప్పటికీ సాయం అందకపోవడం గమనార్హం.
కాప్రా సర్కిల్‌లోని కొన్ని డివిజన్లలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అధికారులు, పోలీసులు, నేతలతో కలిసి ఆర్థిక సాయం అందించారు. రూ.7వేలు, రూ.8వేలు, రూ.9వేలు ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోలా సొమ్ము అందింది. జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పాటు నేతలూ చేతివాటం చూపినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
సోమాజీగూడ డివిజన్‌లోని హరిగేట్ బస్తీకి చెందిన మహిళలు ప్రగతిభవన్ వద్దకు ధర్నాకు వచ్చారు. వరద సాయం అందకుండా అధికార పార్టీ నేతలే తీసుకుంటున్నారని ఆరోపిస్తూ రోడ్డెక్కారు. స్థానిక నేతలు సర్దిచెప్పి పంపించారు.
ఖైరతాబాద్‌లోని డివిజన్లలోనూ ఇదే తంతు జరిగింది. వెంకటేశ్వరకాలనీలో అసలు బాధితులకు సాయం అందలేదంటూ మహిళలు స్థానిక కార్పొరేటర్ ఇంటి ముందు ధర్నా చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకు నిరసన తెలిపారు.