స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ విచారణ ప్రారంభించింది. బృందాలుగా విడిపోయి పలుచోట్ల తనీఖీలు చేపడుతున్నారు. బందర్ రోడ్డులోని రమేష్ హాస్పిటల్స్‌లో, ఆస్పత్రికి సంబంధించిన మిగతా మూడు బ్రాంచ్‌లలో బృందాలు తనిఖీ చేసి ఆస్పత్రిలో కొవిడ్ బాధితులు ఎంత మంది ఉన్నారు, చికిత్స ఎలా జరుగుతుందో, ఫీజు తదితర సమాచారం సేకరించారు. హోటల్‌కి సంబంధించిన యాజమాన్యం నుంచీ సమాచారం సేకరిస్తున్నారు.
ఘటన జరిగిన ప్రాంతానికి ఈరోజు ఉదయమే విద్యుత్ అధికారులు చేరుకుని అగ్నిప్రమాదం ఎలా జరిగింది? ఎటువైపు నుంచి మంటలు వ్యాపించాయి వంటి విషయాలు పరిశీలించారు. అగ్నిప్రమాదం జరిగిన సర్వర్ రూంలో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఫ్యూజులు, విద్యుత్ తీగలు పరిశీలించారు. హోటల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఆర్పేందుకు ఏర్పాటుచేసే స్ప్రింకిల్స్, పొగ గుర్తించే పరికరాలు ఏర్పాటు చేసినా వాటిని వినియోగంలో ఉంచలేదని అగ్నిమాపక అధికారుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సర్వర్ రూంలో అగ్నిప్రమాదం ఎలా జరిగిందో కారణాలు విశ్లేషించారు.
హోటల్‌కు ఉన్న రెండో ద్వారం ఎందుకు మూసివేశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై నివేదిక తయారు చేస్తున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది... ఫైర్ సెఫ్టీకి సంబంధించిన నిబంధనలు ఎంతవరకు అమలు చేశారు, ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారనే వివరాలపై దృష్టి సారించారు. వైద్య, ఆరోగ్య శాఖ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ, జిల్లా యంత్రాంగం నియమించిన కమిటీ, పోలీసుల విచారణ బృందాలు వేరువేరుగా వివరాలు సేకరిస్తున్నారు. రమేష్ హాస్పిటల్స్ నిర్వహణలోని ప్రైవేట్ కొవిడ్ కేర్ సెంటర్లను తనిఖీ చేశారు.
ఘటనపై రమేష్ ఆసుపత్రి యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హోటల్ స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ కేంద్రంలో వైద్యపరంగా బాధితులకు మెరుగైన సేవలు అందించడంపై తాము శ్రద్ధ చూపామని, భవన నిర్వహణ బాధ్యత హోటల్ యాజమాన్యానిదేనని రమేష్ ఆసుపత్రి అధినేత డాక్టర్ పి.రమేష్ బాబు తెలిపారు. హోటల్, ఆసుపత్రి యాజమాన్యాలతోపాటు ఈ ప్రమాదానికి సంబంధించి యాజమాన్యాల వివరణతోపాటు కొవిడ్ కేంద్రం అనుమతి మంజూరు అంశాలపైనా కమిటీలు వివరాలు సేకరిస్తున్నాయి. 48 గంటల కంటే ముందే మొత్తం నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని కమిటీలు భావిస్తున్నాయి.