ప్రశ్న: ఇప్పుడు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కొత్త వైరస్ స్టెయిన్ వివరాలు ఏంటి..?
జవాబు: వైరస్లలో మ్యూటేషన్లు, వేరియేషన్లు రావడం సాధారణమే.. వైరస్ మనిషి శరీరంలోని కణాలలోనికి వెళ్లి దాడిచేసి అందులోని ప్రొటీన్ కణాలను నాశనం చేసిన తరువాత.. వాటిని వైరస్‌గా మార్చి బయటకు వచ్చేటప్పుడు వందలు.. వేలు.. లక్షల వైరస్‌గా మారి కణంలో నుంచి బయటకు వస్తాయి. అత్యంత వేగంగా ఈ చర్య జరిగే క్రమంలో వైరస్‌లో మ్యూటేషన్లు చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మానవ శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని సార్లు అది వైరస్ ఎక్కువగా మ్యూటేషన్ చెందేందుకు దోహదమవుతుంది. ఆ సమయంలో వైరస్ కణాల్లోని జీన్సులో స్వల్ప మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా కరోనా వైరస్‌లో కూడా కొత్తగా మ్యూటేషన్ కనిపించింది. సెప్టెంబరులోనే యూకేలో తొలుతగా కొందరిలో గుర్తించారు. కానీ దాని పూర్తి ప్రభావము తాజాగా ఈ మధ్య వారంరోజుల క్రితమే తెలిసింది. కొత్తగా వచ్చిన మ్యూటేషన్‌పై పూర్తిస్థాయిలో అధ్యయనాలు కొనసాగుతున్నాయి. కొత్తగా గుర్తించిన వైరస్ కు VUI 202012 - virus variation under investigation 202012 గా పిలుస్తున్నారు. కరోనాలో ఇప్పటివరకు 23 కు పైగా మ్యూటేషన్లు వచ్చాయి. వాటిలో 17 ఈ మధ్యే వచ్చాయి. బాగా తెలివిగా మారిపోతున్న వైరస్ వేగవంతంగా మార్పులు చెందుతోంది. వైరస్‌లో అత్యంత కీలకమైన స్పైక్ ప్రొటీన్‌లో 7 మార్పులు వచ్చాయి. వాటిలో 2 ముఖ్యమైనవి.. తాజాగా వచ్చిన మార్పుల వల్ల వైరస్ ఉద్ధృతంగా మారింది.
ప్రశ్న: ప్రపంచ వ్యాప్తంగా టీకా అందుబాటులోకి వస్తున్న సమయంలో వైరస్‌లో వస్తున్న మార్పులనేవి ఆందోళనకరమేనా..? దీని వల్ల ప్రమాదం ఏ స్థాయిలో ఉండవచ్చు?
జవాబు: ఈ పరిస్థితి కొంత ఆందోళనకరమే..! ఈ వేరియేషన్ ద్వారా వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. ఇంతకు ముందు కొవిడ్ జాగ్రత్తలు విధిగా పాటించడం వల్ల ఈ వైరస్ వ్యాప్తిని చాలా వరకు అదుపు చేయగలిగాం. కానీ కొత్తగా వచ్చిన మ్యూటేషన్ వేగంగా వ్యాప్తి చెందడం వల్ల అదుపు కష్టమవుతోంది. కానీ పాత వైరస్ కంటే ఇప్పుడు వచ్చింది ప్రమాదకరమైది కాదు. శరీంరం మీద ఎక్కువ ప్రభావం చూపడం లేదు. పాత వైరస్‌తో సమానంగానే రోగులను ఇబ్బంది పెడుతోంది.
ప్రశ్న: అంటే మాస్క్ , శానిటైజర్లకు వైరస్ లొంగదా?
జవాబు: భద్రతా చర్యలు పాటిస్తే వ్యాప్తిని అరికట్టవచ్చు. ఇంతకు ముందున్న వైరస్ ఒక వ్యక్తి శరీరంలోకి వెళ్లాక.. కొన్ని రోజుల తర్వాత ఇతరులకు వ్యాపించేది. ఈ కొత్త స్ట్రెయిన్ అనేది.. వైరస్ వచ్చిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వెంటనే వ్యాపిస్తోంది. కాబట్టి రోగుల సంఖ్య వేగంగా పెరుగుతుంది.
ప్రశ్న: యూకేలో మళ్లీ లాక్డౌన్ విధించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది...?
జవాబు: యూకేలో పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. భారత్ కంటే ముందుగానే ఇక్కడ వ్యాపించింది. మధ్యలో తగ్గినట్లే తగ్గి రెండో వేవ్ వచ్చింది. ఇప్పుడు వచ్చింది మూడో వేవ్ అనుకోవచ్చు. లండన్ దాని చుట్టుపక్కల పూర్తిస్థాయి లాక్డౌన్ అమలవుతోంది. ఇళ్లలో ఉండే వారు వేరే వారిని కలవడానికి కూడా అనుమతిలేదు. అనవసరంగా పౌరులు బయట ప్రయాణాలు చేయకుండా ఆంక్షలు కొనసాగుతున్నాయి.
ప్రశ్న: ఇప్పుడు యూకేలో వస్తున్న కేసులన్నీ కొత్త స్ట్రెయిన్ వల్లే వస్తున్నాయా..? రోగుల్లో వ్యాధి లక్షణాల్లో మార్పులు వచ్చాయా? పాత చికిత్సా విధానం దీనికి ఉపకరిస్తోందా?
జవాబు: కొత్త వైరస్‌ను సెప్టెంబరులో గుర్తించినప్పుడు 5-10 శాతంలో మందిలో మాత్రమే ఉంది. ఇప్పుడు పరిశీలిస్తే.. 70-80 శాతం మందికి వ్యాప్తి చెందుతున్నట్టుగా గుర్తించారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో 100శాతం కేసులు కొత్త వేరియంట్ ద్వారానే వస్తాయి. రోగలక్షణాల్లో కూడా మార్పు లేదు. రోగుల సంఖ్య కూడా మరీ ఎక్కువుగా పెరగలేదు. చికిత్సా విధానం కూడా అంతే..!
ప్రశ్న: మరి కంగారు ఎందుకు ?
జవాబు: ఎందుకంటే.. ఆసుపత్రులపై భారం పెరుగుతోంది.. ఈ వైరస్ చాలా వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ 70శాతం వేగంగా వ్యాప్తి అనుకున్నారు. కానీ అది అంతకన్నా ఎక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. ఇంతకు ముందు నూటికి ఒకరు చనిపోయారు అనుకుంటే.. ఇప్పుడు రోగుల సంఖ్య పెరగడం వల్ల మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. అది ఆందోళనకరమే కదా..! వైరస్ దాడిని ఎదుర్కొనేందుకు మానవ వనరులు, సమయం చాలా వరకు సరిపోదు. ఒక వ్యక్తి నుంచి సగటున ఎక్కువమందికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దానిని ఎదుర్కొని అరికట్టడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు అత్యవసరం.
ప్రశ్న:కొత్త వేరియంట్ పిల్లలకు ఎక్కువగా వ్యాపిస్తోందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎంతవరకు వాస్తవం.. ?
జవాబు: పాతవైరస్తో పోలిస్తే కొత్త వైరస్ చిన్న పిల్లలకు ఎక్కువగానే సోకుతోంది. వారికి తెలీకుండానే వాళ్లకు వస్తోంది. పిల్లలకు ఇబ్బంది లేకపోయినా.. వారి ద్వారా ఇతరులకు ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని అంచనాల్లో తేలింది.
ప్రశ్న:మ్యుటేషన్ జరిగిన తర్వాత వైరస్‌లో డిలీషన్లు జరుగుతున్నాయని.. దీని ద్వారా వైరస్ మనలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ ప్రభావం నుంచి తప్పించుకుని వేగంగా వ్యాపిస్తుందని సమాచారం. ఇది ఎంత వరకు వాస్తవం?
జవాబు: వైరస్‌లో వచ్చిన రెండు ముఖ్యమైన మ్యుటేషన్స్ వల్ల వైరస్‌ను గుర్తించడం కొంచెం కష్టమవుతుంది. ఇప్పటి వరకు ఇదివేగంగా వ్యాప్తి చెందుతుందని మాత్రమే సమాచారం ఉంది. కానీ.. అది ఎక్కువ ప్రభావవంతంగా ఉందన్న ఆధారాలు లేవు. అందువల్ల దాని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. దానివల్ల తీవ్రమైన ఇన్స్పెక్షన్ వస్తుందని ప్రస్తుతం ఎలాంటి రుజువులు లేవు. కానీ చాలా తొందరగా ఇన్స్పెక్షన్ అవుతుందని తెలుసు.
ప్రశ్న: కొత్త వేరియేషన్లో ప్రోటీన్స్ స్పైక్ మారిపోయి.. వాక్సిన్ ఉత్పత్తి చేసే యాంటీబాడీలను అదుపు చేయగలవు అనే భావన ఉంది. దాని ద్వారా కొత్త వేరియంట్.. కణంలోకి తొందరగా చేరుతుందంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో వాక్సిన్లు ప్రభావం ఎంత వరకు ఉంటుంది..?
జవాబు: స్పైక్ ప్రోటీన్ అనేది ప్రోటీన్‌లో చాలా పెద్ద భాగం. దానిలో వచ్చిన మార్పు చాలా చిన్నది. ఒక అమినో యాసిడ్.. మరో దానిగా మారుతుంది. ఎలా అంటే ఒక పెద్ద భవనంలో రెండు, మూడు ఇటుక రాళ్లలో తేడాలోచ్చినట్లు. అందువల్ల ఈ మార్పుల వల్ల మన వ్యాక్సిన్ నుంచి గానీ మన శరీరంలో ఉండే రోగనిరోధకశక్తిలో కానీ పోరాడేతత్వం తక్కువవుతుందనే వాదనకు అవకాశం లేదు.
ప్రశ్న: ఇప్పుడునటువంటి అన్ని ప్రధాన వాక్సిన్లు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గానీ, ఫైజర్, మెడోర్న్ మార్కట్లో ఉన్నాయి. ఇవి ఈ మ్యూటేషన్స్ అన్నింటిని పరిగణలోకి తీసుకొని ఉంటాయా? ఇప్పుడొచ్చిన వేరియంట్‌ని కూడా ఎదుర్కొనగల్గుతున్నయా? అన్న అంశంపై ఎమైనా అధ్యయనాలు జరిగాయా?
జవాబు: అది ఇంకా సమయం పడుతుంది. మ్యుటేషన్లు ఈ విధంగా అవుతాయని ఎవరూ ఊహించరు. కానీ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసేటప్పుడు వైరస్‌లో ఎక్కువ భాగం మీద రోగనిరోధక శక్తి వచ్చేలా రూపొందిస్తారు. అందువల్ల ఈ వాక్సిన్ల ప్రభావం చాలా తక్కువ. వాక్సిన్ పెద్ద మొత్తంలో త్వరగా ఇవ్వగలిగితే ఈ యుద్ధంలో విజయం సాధించగల్గుతాము.
ప్రశ్న: వాక్సిన్ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు లాక్డౌన్ పెడుతున్నారు. వాక్సినేషన్ ప్రక్రియకు లాక్ డౌన్ అడ్డంకి కాదా..?
జవాబు: వాక్సినేషన్ రెండు వారాల కిందటే మొదలైంది. ఐదులక్షలమందికి మొదటి డోస్ ఇచ్చారు. ఏప్రిల్ లోపు ప్రజలందరికీ వాక్సిన్ వేయాలని దృఢనిశ్చయంతో ఉన్నారు. అనవసర ప్రయాణాలను మాత్రమే లాక్డౌన్లో నియంత్రిస్తున్నారు. పూర్తిగా ఆపడం లేదు. ప్రజలు ఆసుపత్రులకు రావడంపై అభ్యంతరం లేదు. ఇప్పుడు వాక్సిన్ వేయడం సులభం. ట్రాఫిక్ లేదు... సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇంకా వేగంగా చేయొచ్చు.
ప్రశ్న: యూకేలో సెప్టెంబర్‌లోనే కొత్త వేరియంట్ వచ్చిందంటున్నారు. అప్పటి నుంచి రవాణాను అడ్డుకోలేదు. ఇప్పటికే చాలా దేశాలకు ప్రయాణాలు జరిగాయి.. ఇటలీలో గుర్తించారు. సౌతాఫ్రికాలో ఉందంటున్నారు. అంటే చాలా దేశాల్లో వచ్చినట్లే కదా..!?
జవాబు: వైరస్ జన్యుమార్పిడి మీద యూకేలో చాలా పరిశీలన, పరిశోధన ఉంది. ఆ స్థాయి సాంకేతికత ఇక్కడే ఉంది. దానివల్లే ఈ జన్యుమార్పిడిని చాలా తొందరగా గుర్తించగలిగారు. మొదట్లో లండన్ చుట్టపక్కల మాత్రమే ఉందనుకున్నారు. ఇప్పుడు మాపింగ్ చేస్తే.. బ్రిటన్ మొత్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేరియంట్ చాలా ప్రభావవంతంగా ఉంది. పాత వైరస్‌ను పూర్తిగా పారద్రోలి ఇదే వచ్చేసే పరిస్థితి ఉంది.
ప్రశ్న: ఇలాగే జరిగితే మళ్లీ లాక్ డౌన్ తప్పని పరిస్థితి వస్తుందా..? ఒకవేళ లాక్ డౌన్ ఉంటే.. పాత అనుభవాలతో మరింత మెరుగ్గా ఎలా చేయగలుగుతాం..?
జవాబు: అది తప్పనిసరి పరిస్థితిలా కనిపిస్తోంది. అందరికీ వాక్సినేషన్ చేయడం అందరి ముందున్న కర్తవ్యం. ప్రపంచవ్యాప్తంగా 70శాతం మందికి వాక్సిన్ను వీలైనంత తొందరగా తీసుకురాగలిగితే.. అదుపులోకి వస్తుంది. కానీ ఇది పూర్తిగా ఆక్రమించేలోగా తీసుకురాగలమా లేదా అన్నది చూడాలి. అంతర్జాతీయ ప్రయాణాలు నిషేధిస్తే.. కొంతవరకూ పరిస్థితి అదుపులోకి వస్తుంది. వూహాన్లో ఎలా మొదలైందో.. ఇంగ్లండ్‌లో అదే పరిస్థితి ఉంది. వాక్సినేషన్ చాలా వేగంగా చేయాలి.
ప్రశ్న: ఇలాంటి వైరస్ ఒకటి వస్తుందని ఊహించలేదు... అంతా వ్యాపించింది. తగ్గుతుందనుకునే సమయంలో జన్యుమార్పిడి జరిగింది. ఈ ఒక్క మార్పుతోనే ఆగుతుందా..? మరిన్ని జన్యుమార్పులు రావా..? కొత్త వైరస్లు కూడా వచ్చే అవకాశాలు లేవా..? వీటన్నింటినీ ఎలా ఎదుర్కోవాలి...?
జవాబు: అలా జరగదని చెప్పలేం. అలా జరుగుతుందని ఊహించే సిద్ధమవ్వాలి. మరో పెద్ద జన్యు మార్పిడి జరిగే అవకాశం ఉంది. దానికి సిద్ధంగా ఉండాలి. అయితే.. మార్పిడి జరిగిన వెంటనే దాన్ని గుర్తించాలి. బ్రిటన్‌లో జరుగుతున్న స్థాయిలో పరిశీలన ఉంటే సాధ్యమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశీలన ఉండాలి. దాంతో పాటే.. ప్రాంతీయంగా కూడా నిశితంగా వైరస్‌ను గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త వేరియంట్‌పై వాక్సిన్ పనిచేయదు అనే సందేహాలు లేవు. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా వీలైనంత వేగంగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి.
ఇదీ చదవండి: పండుగలు ఇంట్లోనే జరుపుకోండి: ఈటల