International Youth Fest in Rangareddy: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో అంతర్జాతీయ యువజనసదస్సు సందడిగా సాగుతోంది. మూడురోజులపాటు జరగనున్న సదస్సుకు... భారత్ సహా 55 దేశాల నుంచి 10 వేల మంది యువత తరలివచ్చారు. శ్రీరామచంద్ర మిషన్ గ్లోబల్ గురు... కమలేష్ డి పటేల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆజాదీకా అమృత మహోత్సవ్ వేళ... భారత్ వేదికగా కార్యక్రమం జరగడం ప్రత్యేకత సంతరించుకుంది. ప్రపంచం పురోగమనంలో ప్రపంచానికి కావాల్సింది దయ, కరుణ, జాలి అని శాంతి వనం, శ్రీరామచంద్ర మిషన్ ఉద్బోధిస్తోంది. యువతలో సమాజశ్రేయస్సు, నైతిక విలువలు పెంపొందించేందుకు కరుణ, దయ, జాలి, ఓర్పు గుణాలు అలవరచుకోవాలని బోధిస్తోంది.
దయాగుణం యువతలో ప్రోత్సహించేందుకు... శాంతివనం చొరవ తీసుకోవడం సంతోషంగా ఉందని వర్థమాన నటి తాన్య మానిక్తలా సంతోషం వ్యక్తం చేశారు. కమలేష్ డి పటేల్- దాజీ పుస్తకాలు చదివి స్ఫూర్తి పొంది తానూ ఈ అంతర్జాతీయ యువసదస్సుకు హాజరయ్యానని... ఏఆర్ రెహమాన్ ఫౌండేషన్ డైరెక్టర్, గాయకురాలు ఖతీజా రెహమాన్ తెలిపారు.
నేటి సమాజంలో హింస పెరిగిపోవడమే అశాంతికి కారణమవుతోంది. యుక్తాయుక్త విచక్షణ, ప్రజ్ఞ బుద్ధి ద్వారా ఉత్తమగుణం సాధించవచ్చని... నిపుణులు సూచించారు. మానవత్వం మృగ్యమైతున్న ప్రస్తుత తరుణంలో... విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో యువత ఒత్తిళ్లు అధిగమించాలని కమలేష్ పటేల్ పిలుపునిచ్చారు. ధ్యానం ద్వారా దయ, కరుణ అలవర్చుకొని యువత లక్ష్యం చేరుకోవచ్చని నిపుణులు నిర్దేశించారు. దయ, కరుణను నిత్యజీవితంలో సక్రమంగా ప్రదర్శిస్తే అద్భుత ఫలితాలు సాధించొచ్చని యువత అభిప్రాయపడింది.
యువతను సన్మార్గంలో నడిపే లక్ష్యంతో ప్రపంచంలో అతి పెద్ద ధ్యాన కేంద్రం - కన్హా శాంతి వనంలో నిత్యం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిఒక్కరు దయాగుణం కలిగి ఉంటే... ఆ తర్వాత ఎదుటి వారిపట్ల కరుణతో వ్యవహరించాలి. మూడోదశలో పర్యావరణం, ప్రకృతిని ప్రేమించాలని వక్తలు ఉద్బోధించారు. కరుణ, దయను యువతలో పెంపొందించడమే లక్ష్యమని శ్రీరామచంద్ర మిషన్ గ్లోబల్ గురు కమలేష్ డి పటేల్ - దాజీ పేర్కొన్నారు. నేటి ముగింపు కార్యక్రమానికి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ హాజరుకానున్నారు. పర్యావరణం, వాననీటి సంరక్షణ, అడవుల సంరక్షణ వంటి అంశాలపై యువతకు ఆయన అవగాహన కల్పించనున్నారు.
ఇవీ చదవండి: