ఇంటర్‌మీడియట్ వార్షిక పరీక్షలు మే 1 నుంచి ప్రారంభంకానున్నాయి. పదో తరగతి పరీక్షల ప్రణాళిక, రంజాన్ దృష్ట్యా ప్రభుత్వం గతానికి భిన్నంగా ఈసారి ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే నెల 1 నుంచి ప్రథమ సంవత్సరం, 2(ఆదివారం) నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కాలపట్టికను గురువారం విడుదల చేశారు. ప్రథమ ఏడాది పరీక్షలు 19వ తేదీకి, ద్వితీయ సంవత్సరం పరీక్షలు 20వ తేదీకి పూర్తవుతాయి. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మాత్రం మొదటి ఏడాదికి 12వ తేదీతో, రెండో ఏడాది వారికి 13వ తేదీతో ముగుస్తాయి.
అనుకున్న దానికి రెండు రోజుల ముందుగా..
తొలుత ఇంటర్ పరీక్షలను మే నెల 3 నుంచి ప్రారంభించి 24వ తేదీకి పూర్తి చేయాలని, 19వ తేదీకి ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ముగించాలని ఇంటర్‌బోర్డు కాలపట్టిక రూపొందించింది. సాధారణంగా ఇంటర్ షెడ్యూల్ ఖరారు చేసిన తర్వాత పదో తరగతి పరీక్షల తేదీలను ప్రకటించాల్సి ఉంది. ఈసారి అందుకు భిన్నంగా ముందే పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు. 9, 10 తరగతుల విద్యా క్యాలెండర్ విడుదల సమయంలోనే మే 17 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలవుతాయని ప్రభుత్వం పేర్కొంది. దాంతో ఇంటర్ ప్రధాన పరీక్షలు పూర్తికాకుండా పది పరీక్షలు ప్రారంభమైతే పరీక్షా కేంద్రాలు, ఆరోగ్య, పోలీసు సిబ్బంది సర్దుబాటు సమస్యలు వస్తాయని అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఇంటర్‌బోర్డు మూడు రకాల కాలపట్టికలను తయారు చేసి పంపడంతో ప్రధాన సబ్జెక్టులను మే 13వ తేదీతో పూర్తయ్యే షెడ్యూల్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మే 14వ తేదీ రంజాన్ ఉన్నందున ఆలోపు ముఖ్యమైన సబ్జెక్టులు పూర్తయ్యేలా కాలపట్టికను రూపొందించారు.
ఏప్రిల్ 1న నైతిక విలువలు, 3న పర్యావరణ విద్య పరీక్ష
* ప్రథమ సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా రాయాల్సిన ‘నైతిక, మానవీయ విలువలు’ పరీక్ష ఏప్రిల్ 1న, పర్యావరణం విద్యను 3వ తేదీన నిర్వహిస్తారు.
* ఎంపీసీ, బైపీసీ రెండో ఏడాది, ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం, జియాలజీ విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రయోగ పరీక్షలు జరుగుతాయి.