దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజుల్లో 5 డిగ్రీల వరకూ చలి పెరిగింది. ఇంతకాలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇప్పుడు నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో నమోదవుతున్నాయి.
ఆదివారం రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా కొండారెడ్డిపల్లి(నాగర్‌కర్నూలు జిల్లా)లో 10.8 డిగ్రీలు, నల్లవెల్లి(రంగారెడ్డి)లో 11.1, గొడకండ్ల(నల్గొండ)లో 11.4, దోనూరు(మహబూబ్‌నగర్)లో 11.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతాల్లో ఇన్నాళ్లు 15 నుంచి 20 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలుండేవి.
హైదరాబాద్‌లో గాలిలో తేమ సాధారణంకన్నా 21 శాతం తక్కువగా ఉంది. హన్మకొండలో 21 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. ఉదయం పూట కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. రాష్ట్రంలో పగలు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.
ఇదీ చూడండి: రేపటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ