రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ఉన్నతస్థాయి కసరత్తు ప్రారంభమైంది. మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సమగ్ర ప్రతిపాదనల ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు సంబంధించి సీఎంకు అందజేసే నివేదికపై బుధవారం చర్చించారు. గత ఏడేళ్లలో రాష్ట్ర అభివృద్ధితోపాటు కొత్త జిల్లాల ఏర్పాటు, పట్టణ ప్రాంతాల విస్తరణ, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో స్థిరాస్తి రంగ విస్తరణను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో పెంపు కీలకం కానుంది.
హేతుబద్ధంగా..
భూముల విలువను భారీగా పెంచితే ఆ మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీల భారం పెరుగుతుంది. ఇదే సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలనూ పెంచాలని ప్రతిపాదించారు. రెండింటి భారం ఎక్కువగా ఉంటే ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా అనధికార లావాదేవీలకు ఆస్కారముంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు హేతుబద్ధంగా ఉండటం పెంపుదలలో కీలక అంశమని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. భూముల విలువ పెంపునకు సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులపై రిజిస్ట్రేషన్ల శాఖ.. జిల్లా రిజిస్ట్రార్లు, సబ్‌రిజిస్ట్రార్లతో చర్చించనుంది. తాజా పరిస్థితులు తెలుసుకోవడంతోపాటు ఏ ప్రాంతాల్లో ఎంత పెంచాలనే అంశంపై చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు.
భూముల విలువ పెంపే కీలకం..
రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుకంటే భూముల విలువ పెంపే రాబడిలో కీలకమైన అంశమని అధికారులు పేర్కొంటున్నారు. భూముల బహిరంగ మార్కెట్ విలువతోపాటు, క్రయవిక్రయాలు ఎలా జరుగుతున్నాయి? ఏ ప్రాంతాల్లో డిమాండ్ ఉంది? వంటి అంశాలపై అధ్యయనం చేయనున్నారు. పెంపుదలకు సంబంధించి వివిధ ప్రతిపాదనలు, రాబడుల విశ్లేషణను ముఖ్యమంత్రికి సమర్పించే నివేదికలో పొందుపరచడమే తమ ముందున్న లక్ష్యమని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ నివేదికపై మంత్రివర్గ ఉపసంఘం సమగ్రంగా చర్చించాక ముఖ్యమంత్రికి అందజేస్తారు.