సంక్రాంతికి ఇంటికి వెళ్లేవారితో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజూ సుమారు 1.80 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. కానీ పండుగ సందర్భంగా 2.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా భారీ సంఖ్యలో ప్రయాణికులు సొంతూళ్లకు వెళుతుండటంతో రైళ్లలో నిల్చునే ప్రయాణం చేస్తున్నారు. లగేజ్ కోచ్‌లలో కూడా ప్రయాణిస్తున్నారు. ప్రతిరోజూ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 220 రైళ్లు వచ్చి వెళ్తుంటాయి. వీటికి అదనంగా సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 408 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
బస్స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి..
సొంతూళ్లకు వెళ్లే వారితో బస్స్టేషన్లూ కిటకిటలాడుతున్నాయి. జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు నగర శివారులోని బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ 4,940 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,414 బస్సులను, ఏపీలోని వివిధ ప్రాంతాలకు 1,526 బస్సులను నడుపుతున్నారు. ఇవాళ 1350 బస్సులను నడిపామని, రేపు ఎల్లుండి కూడా ప్రత్యేక బస్సులను నడుపుతామని రంగారెడ్డి ఆర్.ఎం వరప్రసాద్ పేర్కొన్నారు. పోలీసుల సహాయంతో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, కేపీహెచ్‌బీ నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయన్నారు.
నగదు చెల్లింపులో ఆలస్యం..
హైదరాబాద్-విజయవాడ రహదారిపై టోల్‌గేట్ల వద్ద సొంత వాహనాల్లో ఊళ్లకు బయలుదేరుతున్న వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, కేతెపల్లి మండలం ఇనుపాముల టోల్‌ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్‌జాం అయింది. ఫాస్టాగ్ పద్ధతితో వాహనాలు నగదు చెల్లింపులో ఆలస్యం కారణాలతో మరింత ఆలస్యంగా వాహనాలు కదిలాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద గతంలో 16 లైన్లలో 10 లైన్లు ఫాస్టాగ్ వాహనాలకు వదిలేవారు. పండుగతో ఎనిమిదికి కుదించారు.
ఇదీ చూడండి : నగ్నంగా నృత్యాలు చేస్తున్న 22 మంది యువతుల అరెస్ట్