IBPS Notification: వచ్చే ఏడాదిన్నరలో పది లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీచేసే ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాల్సిందిగా ప్రధాని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఈమధ్య విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దానికి తగిన విధంగానే వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు ఖాళీల భర్తీకి సమాయత్తమవుతున్నాయి. స్టాఫ్‌సెలెక్షన్ కమిషన్ 70 వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
రైల్వే, ఇతర శాఖల్లోని ఖాళీలను కూడా భర్తీ చేసే ప్రక్రియ మొదలు పెడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు త్వరలో రాబోతున్నాయి. ఐబీపీఎస్ ఇదివరకే ప్రకటించిన పరీక్షల క్యాలండర్ ప్రకారం త్వరలోనే పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్ల నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. ఎస్‌బీఐ నుంచి కూడా పీవో, క్లర్క్ నోటిఫికేషన్లు ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది.
గత ప్రశ్నపత్రాలు గమనిస్తే.. గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఏయే టాపిక్స్ నుంచి ఎన్నెన్ని ప్రశ్నలు వస్తున్నాయో...ఆ వెయిటేజి అర్థమవుతుంది. ఇంగ్లిష్ విభాగంలో గ్రామర్ ఆధార ప్రశ్నలు ఎక్కువ. ఉదాహరణకు జంబుల్డ్ సెంటెన్సెస్, ఎర్రర్ కరెక్షన్, ఫిల్లర్స్, రీ అరేంజ్‌మెంట్ ఆఫ్ వర్డ్/ సెంటెన్స్, క్లోజ్ టెస్ట్ లాంటివి. ఇవి సాధించాలంటే గ్రామర్‌పై అవగాహన అవసరం.
అయితే పాఠశాల స్థాయిలోనే అభ్యర్థులంతా ఇంగ్లిష్ గ్రామర్ నేర్చుకుని ఉంటారు. కాబట్టి వారికి దానిపై అవగాహన తప్పనిసరిగా ఉంటుంది. అందువల్ల పరీక్షలో వచ్చే ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తూ సందేహమున్నప్పుడు సంబంధిత గ్రామర్‌ను చూసుకుంటే ఇంగ్లిష్ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు సాధించవచ్ఛు అన్ని విభాగాల్లోని టాపిక్స్‌ని బాగా నేర్చుకుంటే ఆపై ప్రశ్నను వేగంగా సాధిచగలిగేలా వీలైనంత ప్రాక్టీస్ చేయాలి. సాధన చేస్తూ ఉంటేనే ప్రశ్నలను వేగంగా సాధించగలిగే మెలకువలు అర్థమవుతాయి.
బీఎస్‌ఐఆర్ పరీక్షలు.. ఒకటే సన్నద్ధత.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలైన బ్యాంకు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ఇన్సూరెన్స్, రైల్వే పరీక్షలు సబ్జెక్టుపరంగా, పరీక్ష విధాన పరంగా దాదాపు ఒకే విధంగా ఉంటాయి. పరీక్షలపరంగా ఉండే కొద్దిపాటి భేదాలను మినహాయిస్తే దాదాపు 70-80 శాతం ఒకేలా ఉంటాయి.
కాబట్టి ఐబీపీఎస్ క్లర్క్ ప్రిపరేషన్ త్వరలో రాబోయే ఇతర బ్యాంకు పరీక్షలు, కేంద్ర ప్రభుత్వ పరీక్షలకు ఉపయుక్తం. బ్యాంకు పరీక్షలన్నీ ఒకేవిధంగా ఉంటాయి. ఈ ప్రిపరేషన్ వాటికీ సరిపోతుంది. ఇతర పరీక్షలకు వాటికి అదనంగా ఉండే సబ్జెక్టులపరంగా సన్నద్ధతలో మార్పులు చేసుకుంటే చాలు. అయితే ముందుగా ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షకు పూర్తి స్థాయిలో సిద్ధమవ్వాలి.
ప్రిలిమినరీ పరీక్షను సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్ష అక్టోబరులో ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ పరీక్షకు కనీసం 60 రోజులు, మెయిన్స్‌కు 90 రోజుల సమయం ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు రెండింటిలోనూ ఉండే మొత్తం నాలుగు విభాగాల్లో.. మూడు రెండింటిలోనూ ఉమ్మడిగా ఉన్నాయి. కాబట్టి ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటికీ కలిపే సన్నద్ధమవ్వాలి. ఆప్టిట్యూడ్, రీజనింగ్ విభాగాలను హెచ్చు స్థాయిలోనే అధ్యయనం చేయాలి.
మొదటిసారి రాసేవారు ముందుగా ఆప్టిట్యూడ్, రీజనింగుల్లోని టాపిక్స్ అన్నింటినీ బాగా నేర్చుకోవాలి. ఒక్కోదానిలో 10-15 టాపిక్స్ ఉంటాయి. ప్రతిరోజూ రెండింటిలో ఒక టాపిక్‌ను పూర్తిగా నేర్చుకోవాలి. పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు వచ్చే అంశాలను ముందుగా పూర్తిచేసి ఆ తర్వాత ఒక ప్రశ్న వచ్చే టాపిక్స్ నేర్చుకోవాలి.
ఉదాహరణకు ఆప్టిట్యూడ్‌లో సింప్లిఫికేషన్స్ నుంచి కనీసం 10, నంబర్ సిరీస్ నుంచి 5, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి 5, డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి 5 ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని ముందుగా పూర్తిచేసుకుని ఆపై ఒక్కో ప్రశ్న వచ్చే అరిథ్‌మెటిక్ టాపిక్స్ నేర్చుకోవాలి. అదేవిధంగా రీజనింగ్‌లో సీటింగ్ అరేంజ్‌మెంట్, పజిల్స్ టాపిక్స్ నుంచి 15-20 ప్రశ్నలు వస్తాయి. వీటిలోనే బ్లడ్ రిలేషన్స్‌తో కలిపి కొన్నిసార్లు ప్రశ్నలు వస్తాయి. ముందుగా వాటిని.. ఆ తర్వాత ఇతర టాపిక్స్‌ను నేర్చుకోవాలి.
మోడల్ టెస్ట్‌లు తప్పనిసరి.. వీలైతే ప్రారంభం నుంచీ లేకపోతే టాపిక్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత రోజూ తప్పనిసరిగా పరీక్షలోని పూర్తిస్థాయి మాదిరి ప్రశ్నపత్రం రాయాలి. ఆపై దాన్ని విశ్లేషిస్తే ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మెరుగుపరుచుకోవాల్సిన టాపిక్స్/ విభాగాలను గుర్తించి తదనుగుణంగా సిద్ధమయ్యే అవకాశం కలుగుతుంది. నిర్ణీత సమయంలో ఎన్ని ప్రశ్నలను సాధించగలుగుతున్నారో కూడా అర్థమై..ఆ సంఖ్యను పెంచేలా ప్రాక్టీస్‌లో మార్పులు చేసుకోవచ్చు.
కరెంట్ అఫైర్స్‌పై నోట్సు.. ప్రారంభం నుంచే రోజూ వార్తాపత్రికను చదువుతూ అంతర్జాతీయ, జాతీయ, ఆర్థిక, బ్యాంకింగ్, సాంకేతికత మొదలైనవాటి ముఖ్య విషయాలను నోట్ చేసుకోవాలి. ప్రతివారం వాటన్నింటినీ తిరిగి చూసుకుంటే జనరల్ అవేర్‌నెస్ కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యే అవసరం ఉండదు. అయితే బ్యాంకింగ్ టర్మినాలజీ విషయాలు బాగా తెలుసుకోవాలి. దీంతోపాటే మెయిన్స్ పరీక్షలో రీజనింగ్ విభాగంలో ఉండే కంప్యూటర్ ఆప్టిట్యూడ్‌లో కంప్యూటర్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవాలి.
పరీక్షలో దాని నుంచి ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయో గమనించి తదనుగుణంగా వాటిని నేర్చుకోవాలి. ఇవన్నీ కవరయ్యే విధంగా రోజూ తగిన సమయం కేటాయించుకుని చదవాలి. ఎంత సమయం చదివాం అని కాకుండా ఎంతమేర నేర్చుకున్నామనేది ముఖ్యం. ఐబీపీఎస్ క్లర్క్ పరీక్ష ప్రిపరేషన్ రాబోయే ఇతర పరీక్షలకూ ఉపయోగపడుతుంది.
నోటిఫికేషన్ వివరాలు..
పోస్టుల సంఖ్య : 6035
విద్యార్హతలు : ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వయసు
(జనరల్ అభ్యర్థులకు) : 20-28 సంవత్సరాలు (01.07.22 నాటికి)
దరఖాస్తు ఫీజు : రూ. 175 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్వీస్‌మెన్) రూ.850 (ఇతరులు)
దరఖాస్తులకు చివరి తేది : 21.07.2022
పరీక్ష తేది : సెప్టెంబరు 2022-ప్రిలిమ్స్ అక్టోబరు 2022 - మెయిన్స్
వెబ్‌సైట్ : www.ibps.in