IAS, IPS Transfers : ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీల అంశం చాలా రోజులుగా వినిపిస్తోంది. ఆగస్టులో కొంత మందికే పదోన్నతులు, బదిలీలు చేశారు. దీంతో మిగతా అధికారుల బదిలీలు కూడా ఉంటాయని ప్రచారం జరిగింది. పదోన్నతి లభించినప్పటికీ చాలా మంది పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. ఐపీఎస్ అధికారుల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. పైస్థాయికి పదోన్నతి లభించినా కూడా పాత పోస్టులోనే కొనసాగుతూ వచ్చారు. ఐఏఎస్ అధికారుల్లో చాలా మంది అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొందరు అధికారులు మూడు, నాలుగు బాధ్యతలు చూడాల్సి వస్తోంది. కొన్ని చోట్ల కింది స్థాయి అధికారులు ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. మరికొన్ని చోట్ల కీలక శాఖలకు పూర్తిస్థాయి అధికారులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని జిల్లాలకు ఇతర జిల్లాల కలెక్టర్లు, మరికొన్ని చోట్ల అదనపు కలెక్టర్లే.. పాలనాధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు ఐఏఎస్ అధికారులు వెయిటింగ్‌లో ఉన్నారు.
కోడ్ ముగియగానే..
వరుస ఎన్నికల నేపథ్యంలో బదిలీల ప్రక్రియ కొంత ఆలస్యమైందని అధికారవర్గాలు భావిస్తున్నాయి. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 10న పూర్తయింది. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. కోడ్ ముగియగానే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని అంటున్నారు. ఈ దిశగా ఇప్పటికే కొంత కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. కొన్ని జిల్లాల కలెక్టర్లు సహా సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని, అదనపు బాధ్యతల్లో ఉన్న పలు పోస్టులకు పూర్తి స్థాయిలో అధికారులను నియమించే అవకాశముందని తెలుస్తోంది. ఐపీఎస్ అధికారుల్లో ఎస్పీలు,కమిషనర్లు, సీనియర్ అధికారులను స్థానచలనం ఉంటుందని తెలుస్తోంది. సర్కారుకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఉన్నతాధికారుల బదిలీలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదీచూడండి: Kashmir Encounter: కశ్మీర్లో ఎన్కౌంటర్- ఉగ్రవాది హతం