మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అవంచకు చెందిన నర్సింహారెడ్డికి బండి చలానా విషయంలో విచిత్ర ఘటన ఎదురైంది. తనకున్న గ్లామర్ బైక్‌పై రెండు చలాన్లున్నట్లు చరవాణికి మెస్సేజ్ వచ్చింది. ఈ నెల 30న ఇదే వాహనంపై హైదరాబాద్‌లో హెల్మెట్ లేకుండా ముగ్గురు ప్రయాణం చేయటం వల్ల ఆ జరిమానాలు పడ్డాయని అందులోని సారాంశం. ఆ మెస్సేజ్ చూసి అవాక్కవటం నర్సింహారెడ్డి వంతైంది.

అసలు ఆ ఫైన్లు ఎలా పడ్డాయంటే...
ఎనిమిదేళ్ల క్రితం నర్సింహారెడ్డి... హీరో గ్లామర్ బైక్ కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ చేయించగా... టీఎస్15ఈఏ-3392 నెంబరు కేటాయించారు. నర్సింహారెడ్డి... నర్సాపూర్‌కు, ఆ పక్కనే ఉన్న దౌల్తాబాద్‌కు మాత్రమే ద్విచక్రవాహనంపై వెళ్తాడు. ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే మాత్రం బస్సులనే ఆశ్రయిస్తాడు. అలాంటిది... ఈ నెల 30న ఇదే వాహనంపై హైదరాబాద్‌లో హెల్మెట్ లేకుండా ముగ్గురు ప్రయాణం చేసినందుకు గానూ... 2 ఫైన్‌లు పడినట్లు చరవాణికి మెస్సేజ్ వచ్చింది. అది చూసి కంగుతిన్న నర్సింహారెడ్డికి చిక్కు ప్రశ్న ఎదురైంది. తానున్నది అవంచ గ్రామంలో అయితే... ఇలా ఎలా వచ్చిందని ఆలోచించాడు. బండి నెంబర్‌తో వెబ్సైట్లో పరిశీలించగా... ఫొటోలు కనిపించాయి. అసలు కథ అప్పుడర్థమైంది. ఆ ఫొటోల్లో ఉన్నది టీవీఎస్ ఎక్సెల్. తనకున్నది గ్లామర్.

ఆ టీవీఎస్ ఎక్సెల్ వాహనదారుడు తన వాహనం నెంబరు వాడుతున్నాడని తెలుసుకున్న నర్సింహారెడ్డి నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
