హైదరాబాద్‌లోని వాహనదారులకు వర్షాల(hyderabad rains news) కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు(hyderabad traffic problems).. గతుకుల రోడ్ల(Hyderabad Roads) ఇక్కట్లతో పాటు... ఇప్పుడు కొత్త కష్టమొచ్చి పడింది. చినుకుపడితే చాలు చెరువులయ్యే రోడ్ల(Hyderabad Roads)తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వర్షం సమయంలో వరదలతో రోడ్లపై ఉన్న గుంతలు కనబడక.. వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మరోవైపు.. వానలు తగ్గాక కూడా ఆ వరదలు తెచ్చిన ఇసుక ప్రమాదాలకు కారమణవుతోంది.
రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌లోని రోడ్లన్ని వరదలయ్యాయి. వర్షం కాస్త ఆగిపోవటంతో.. రోడ్లపై నీళ్లు పోయి.. వరదలు తెచ్చిన మట్టి, ఇసుక మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ క్రమంలోనే ఎప్పుడు రద్దీగా ఉండే.. కూకట్పల్లి జాతీయ రహదారిపైన కూడా వర్షాల కారణంగా మట్టి, ఇసుక చేరుకుంది. రోడ్డుపై చేరిన ఇసుకతో.. వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
తేజ్ ప్రమాదానికి కారణమదే..
ఇటీవల మాదాపూర్‌లో జరిగిన హీరో సాయిధరమ్‌తేజ్ ప్రమాదానికి.. రోడ్డుపై మట్టి ఉండటమే కారణమని తేలింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న సమయంలో బ్రేక్ వేయగా.. రోడ్డుపై మట్టి ఉండటంతో బైక్ అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్‌తేజ్.. ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు.
సిబ్బంది నిర్లక్ష్యంతో..
హైదరాబాద్‌లో మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకూడదని మంత్రులు, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. రోడ్లపై ఎక్కడా మట్టి ఉండకుండా శుభ్రం చేయాలని ఆదేశించారు. తేజ్ ప్రమాదం జరిగిన మరుసటి రోజున ఆ రహదారి అంతా జీహెచ్ఎంసీ సిబ్బంది ఉడ్చేసి.. శుభ్రం చేసి హడావిడి చేశారు. మళ్లీ.. ఇప్పుడు కురిసిన వానలకు అదే పరిస్థితిలో రోడ్లు ఉంటే.. పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. ఉన్నతాధికారుల ఆదేశాలున్నా.. కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మూడు రోజుల నుంచి కూకట్పల్లి జాతీయ రహదారి రోడ్డుపై మట్టి అలాగే పేరుకుపోయింది. కొన్నిచోట్ల వర్షానికి సన్నటి ఇసుక కొట్టుకొచ్చి నిలిచింది. రోడ్లపై వెళ్లే వాహనదారులు ఇసుక ఉండటం వల్ల భయంభయంగా వెళ్తున్నారు.
స్పందిస్తారా..?
ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ రహదారిపై.. ఇలా ఇసుక, మట్టి ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఎవరు ప్రమాదానికి గురికాక ముందే.. రోడ్డుపై పేరుకుపోయిన ఇసుక, మట్టిని శుభ్రం చేయాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి.. అధికారులు స్పందించి రోడ్లపై ఉన్న గుంతల పని పట్టకపోయినా.. కనీసం ఇసుక, మట్టిని తొలగిస్తారో.. లేదో..!
ఇవీ చూడండి: