తెదేపా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి(tdp leader pattabhi) ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మంగళవారం పట్టాభి ఇంటిపై దుండగులు దాడి చేయగా.. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా దృశ్యాలతో పాటు.. ఇతర ఆధారాలు అందజేయాలంటూ నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని పోలీసులు తెలిపారు. కాలింగ్ బెల్ కొట్టినా పట్టాభి కుటుంబసభ్యులు ఇంటి తలుపులు తీయడం లేదని.. పోలీసులు తెలిపారు.
అసలేం జరిగింది..
తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నివాసంపై కొందరు దుండగులు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. కింది, మొదటి అంతస్తుల్లో తీవ్ర విధ్వంసం సృష్టించారు. వాహనాలు, విలువైన ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. విజయవాడ కనకదుర్గ గెజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలోని అంబేడ్కర్ పార్కు దగ్గర ఉన్న పట్టాభి ఇంటిపై మంగళవారం సాయంత్రం 4.15 గంటల నుంచి 15 నిమిషాల పాటు ఈ దాడి సాగింది. ఆ సమయంలో పట్టాభి ఇంట్లో లేరు. ఆయన ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దుండగులను చూసి ఇంట్లో ఉన్న డ్రైవర్, పనిమనిషి, పట్టాభి కుమార్తె భయాందోళనలకు లోనయ్యారు. పట్టాభి కుమార్తెను పని మనుషులు స్నానాలగదిలో దాచి కాపాడారు. ఈ దాడికి పాల్పడింది వైకాపా శ్రేణులేనని పట్టాభి భార్య చందన, తెదేపా నేతలు ఆరోపించారు.
ఆటోల్లో వచ్చి...
పట్టాభి ఇంటికి సమీపంలో మంగళవారం సాయంత్రం కొన్ని ఆటోలు వచ్చి ఆగాయి. వాటిలో నుంచి దాదాపు 60 మంది మహిళలు, యువకులు కర్రలు, రాడ్లతో దిగారు. నేరుగా ఇంట్లోకి వచ్చి... పట్టాభి ఎక్కడ.. ప్రభుత్వంపై, పార్టీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. మా చేతిలో ఈ రోజు మూడింది... అని పెద్దగా అరుస్తూ ఇంట్లోకి దూసుకొచ్చారు. ఆ సమయంలో డ్రైవర్ శివారెడ్డి, పనిమనిషి గోవిందమ్మ, పట్టాభి కుమార్తె 11 ఏళ్ల వయసున్న అన్నపూర్ణ ఇంట్లో ఉన్నారు. పోర్టికో దగ్గర దుండగులను డ్రైవర్ అడ్డగించేందుకు ప్రయత్నించారు. అతడిని దుర్భాషలాడుతూ కొట్టి, మెడపై కత్తి పెట్టి బెదిరించారు. పూలకుండీలు, బండలు, కుర్చీని విసిరి ద్విచక్ర వాహనాన్ని, కారును ధ్వంసం చేశారు. హాల్లోకి వెళ్లి ఫ్రిజ్‌లు, సీసీ కెమెరా హార్డ్ డిస్క్, టీవీలను పగులగొట్టారు. వంట గదిలోని ఫ్రిజ్, సామగ్రిని విసిరివేశారు. మొదటి అంతస్తుకు వెళ్లే మెట్ల పక్కనున్న గ్లాసులనూ బద్ధలు కొట్టారు. తర్వాత పైకి వెళ్లి పట్టాభి కార్యాలయంలోని కంప్యూటర్, ఇతర వస్తువులను, హాలులోని డైనింగ్ టేబుల్ అద్దాన్నీ పగులగొట్టారు. బెడ్‌రూమ్‌లోని టీవీ, ఇతర వస్తువులను పగులగొట్టారు.
గడియపెట్టి కాపాడారు.
పట్టాభి, ఆయన కుటుంబ సభ్యులు ఎవరుంటే వారిపై దాడి చేయాలని దుండగులు కేకలు వేశారు. ఆ సమయంలో పట్టాభి కుమార్తె అన్నపూర్ణ కింది అంతస్తులోని స్నానాలగదిలో ఉంది. పాపను రక్షించేందుకు పనిమనిషి స్నానాలగది తలుపునకు బయట గడియపెట్టారు. పని మనుషులపై దుండగులు బెదిరింపులకు దిగి పట్టాభి ఎక్కడంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో గోవిందమ్మపై దాడి చేశారు. 15 నిమిషాల పాటు దాడికి పాల్పడి తిరిగి ఆటోల్లో వెళ్లిపోయారు. ఆ సమయంలో అన్నపూర్ణ బయటకు వచ్చి ఉంటే ఆమెపై భౌతికంగా దాడి చేసేవారని పని మనుషులు చెప్పారు.
మఫ్టీలో పోలీసు ఆరా!
దాడికి ముందు ఓ పోలీసు కానిస్టేబుల్ మఫ్టీలో వచ్చి పట్టాభి గురించి ఆరా తీయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పటమట పోలీసుస్టేషనుకు చెందిన కానిస్టేబుల్ మఫ్టీలో వచ్చి వెళ్లారని, పట్టాభి ఉన్నారా అని ఇంట్లో వారిని అడిగినట్లు చెబుతున్నారు. తర్వాత 3.40 గంటలకు పట్టాభి భార్య చందన వ్యక్తిగత పని నిమిత్తం బయటకు వెళ్లారు. తిరిగి 4.40 గంటలకు చందన ఇంటికి వచ్చే సరికే విధ్వంసం జరిగింది. పట్టాభి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇంటికి చేరుకుని ఉండవచ్చనే సమాచారంతోనే దాడికి పాల్పడ్డట్లు తెలిసింది. వచ్చిన మఫ్టీ పోలీసు ఎవరనేదీ తేలాల్సి ఉంది. సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు ఉన్నట్లు చెబుతున్నారు.
భద్రతా వైఫల్యం వల్లే...
తెదేపా నేత పట్టాభిపై దాడి చేయడం ఏడాది కాలంలో ఇది మూడోసారి. గత ఏడాది అక్టోబరు 4న తొలి దాడి జరగగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 2న పది మంది వచ్చి ఇంటి సమీపంలోనే కారుపై, పట్టాభిపై దాడి చేశారు. కారు అద్దాలను పగులగొట్టడమే కాకుండా పట్టాభిని గాయపరిచారు. ఇప్పుడు మళ్లీ మూడో దాడి చోటుచేసుకుంది. ప్రస్తుత దాడికి పాల్పడింది వైకాపా శ్రేణులేనని, వారికి తన కుమార్తె కనిపించి ఉంటే చంపేవారని పట్టాభి భార్య ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Tdp Leaders Arrest News: ఆంధ్రాలో టెన్షన్ టెన్షన్... తెదేపా నేతల నిర్బంధం... నిరసనలు.. అరెస్టులు...