భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు (జులై 3న) సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కమలనాథులు ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు 10 లక్షల మందికిపైగా ప్రజలు తరలివచ్చేలా చేసి తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టించాలని యోచిస్తున్నారు. సమావేశాలు, బహిరంగసభ విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు, అసెంబ్లీ నియోజకవర్గాల ప్రభారీలతో రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు జాతీయ కార్యవర్గ సమావేశాల సన్నాహక కమిటీ ఛైర్మన్ లక్ష్మణ్, కమిటీ జాతీయ ఇన్‌ఛార్జి అరవింద్ మీనన్ రోజంతా సమీక్షలు నిర్వహించారు. ఆయా కమిటీలకు అప్పగించిన బాధ్యతల నిర్వహణ విషయంలో పురోగతిపై దిశానిర్దేశం చేశారు.
నియోజకవర్గానికి 10వేల మందికి తగ్గకుండా..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ముఖ్యనేతలంతా జులై 3న జరిగే సభకు హజరై తెలంగాణ ప్రజానీకానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమాచారాన్ని రాష్ట్రంలోని గడప గడపకూ తెలియజేయాలని భాజపా యోచిస్తోంది. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి బహిరంగసభకు సంబంధించిన ఆహ్వానపత్రికను అందజేయాలని భావిస్తోంది. ఇందుకోసం 50 లక్షల ఆహ్వానపత్రికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 30 మంది, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సగటున 10 వేల మందికి తగ్గకుండా హాజరయ్యేలా చూడాలని పార్టీ శ్రేణులకు నేతలు పిలుపునిచ్చారు.
ఈ నెల 22న అసెంబ్లీ నియోజకవర్గాల ప్రభారీలంతా తమకు అప్పగించిన నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి స్థానిక నేతలతో సమావేశమై జనసమీకరణతో పాటు స్థానికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను సన్నద్ధం చేయాలని రాష్ట్ర నాయకత్వం సూచించింది. జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం ఉండాలన్నదే పార్టీ నిర్ణయమని, ప్రతి పోలింగ్ బూత్ నుంచి మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు విరాళాలు సేకరించాలని ఆదేశించింది. ఆయా విరాళాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు స్వీకరించవద్దని, పార్టీ రాష్ట్ర శాఖ పేరిట ఉన్న ఖాతాకు మాత్రమే డిజిటల్ పేమెంట్లు చేయాలని స్పష్టం చేసింది. వీటితోపాటు ఈనెలలో నిర్వహించబోయే యోగా దివస్, జాతీయ ఎమర్జెన్సీ డే వంటి కార్యక్రమాల సందర్బంగా చేపట్టాల్సిన కార్యాచరణపైనా నేతలకు దిశానిర్దేశం చేశారు.
గులాబీ వనంలో కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రస్తుతం ఉన్న శక్తి సరిపోదని, మరింత చెమటోడ్చాల్సిన అవసరముందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. పలు జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి పూర్తి స్థాయిలో సహకరించడంలేదని తెలుస్తోంది. అక్కడ పార్టీ విస్తరణ, బలోపేతానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా నేరుగా జాతీయ నాయకత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌ల నియామక ప్రక్రియకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా అధ్యక్షులకు సంబంధం లేకుండానే నేరుగా నియోజకవర్గాల సమాచారాన్ని బండి తీసుకునే అవకాశముంది. దీంతో క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల్లో ఉంటున్నారనే నివేదిక నేరుగా బండి సంజయ్‌కు అందనుంది. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ పాదయాత్ర రెండు విడుతల పూర్తిచేశారు. ఆయన పర్యటనలు చేసిన తర్వాత కూడా ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలు ఉత్సాహంగా పనిచేయడంలేదు. దీంతో స్థానికేతరులను రంగంలోకి దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
బూత్‌స్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఇంఛార్జీలను కూడా నియమిస్తే బాగుటుందని జాతీయ నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ టికెట్ ఆశించే వారికి కాకుండా దాదాపు ఎన్నికలకు దూరంగా ఉండి పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. నియామకమైన ఇన్చార్జీలు నెలలో కనీసం 20 రోజులైనా వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేపడుతూ పార్టీ విస్తరణకు కృషి చేయాలని రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇంఛార్జీల బాధ్యతలు కేవలం వచ్చే నెలలో చేపట్టబోయే జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోడీ సభ వరకు మాత్రమేనని పార్టీలోని మరికొంత మంది నేతలు చెబుతున్నారు.
ఇవీ చూడండి: