స్టార్ రేటెడ్ విద్యుత్తు పరికరాలను కొనుగోలు చేయాలి. సహజ వెలుతురులో నివసించడం అలవాటు చేసుకోవాలి. అవసరం లేని చోట లైట్లు, ఫ్యాన్లు, ఇతర పరికరాల స్విచ్‌లు ఆఫ్ చేయాలి. పాత టీవీలు, ఫ్యాన్లకు బదులు వాటి స్థానంలో కొత్త ఎల్‌ఈడీ, ఎల్‌సీడీ టీవీలు వాడాలి. టీవీ చూసేటప్పుడు ఎక్కువ వెలుతురు అవసరం లేదు. డిమ్ లైట్ వేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో దొరికే లైట్ డిమ్మర్లతో సగం విద్యుత్తు ఆదా అవుతుంది. బల్బుకు విద్యుత్తు ప్రవాహాన్ని తగ్గిస్తాయి.
- రాజుచౌహన్, ఎస్‌ఈ, వరంగల్, టీఎస్ ఎన్పీడీసీఎల్
వినియోగం తగ్గించాం
మా ఇంటికి ప్రతి నెలా రూ.1500 నుంచి రూ.2000 వరకు బిల్లు వచ్చేది. భారం తగ్గించేందుకు కరెంటు ఆదా చేస్తున్నాం. పాత ఫ్యాన్లు, ఇంట్లో ఉండే వైరింగ్ పరికరాలు మార్చుకున్నాం. వాషింగ్ మిషన్, గీజర్ వినియోగం తగ్గించాం. ప్రస్తుతం రూ.1100 కరెంటు బిల్లు వస్తోంది.
- పొట్లపల్లి వీరభద్రరావు, హన్మకొండ
దీపాలు: నాణ్యమైన ఎల్‌ఈడీ బల్బులు, ట్యూబ్‌లైట్లతో విద్యుత్తు వినియోగం తక్కువగా ఉంటుంది. 10, 20, 22 వాట్స్‌వి సరిపోతాయి. పగలు కిటికీలు తెరవాలి. రాత్రుళ్లు మనం ఎక్కడుంటే అక్కడే బల్బులు వేసుకోవాలి. కొత్త ఇళ్లలో సెన్సర్‌తో పనిచేసే బల్బులు మంచిది. ట్యూబ్‌లైట్లలో త్రీ ఇన్ వన్ వచ్చాయి. ఒకసారి స్విచ్ వేస్తే తెలుపు, రెండోసారి వామ్ వైట్, మూడోసారి తక్కువ వెలుతురుతో వెలుగుతాయి.
ఆ ఒక్కటీ దాటనివ్వొద్ధు.
విద్యుత్తు వినియోగాన్ని బట్టి పంపిణీ సంస్థ స్లాబులుగా విభజించి ఛార్జీలు వసూలు చేస్తోంది. నెలలో వంద యూనిట్ల వరకు వాడితే బిల్లు రూ.202.50 వస్తుంది. ఒక్క యూనిట్ అదనంగా వాడినా స్లాబు మారి రూ.334.30 అవుతుంది. ఇంధన సుంకం, సేవా రుసుము అదనం. యూనిట్లు వంద దాటకుండా చూసుకుంటే నెలకు రూ.131.80, ఏడాదికి రూ.1581.6 ఆదా చేసుకోవచ్ఛు 200 యూనిట్ల వరకు విద్యుత్తు బిల్లు రూ.760 వస్తుంది. ఒక్క యూనిట్ ఎక్కువ వాడినా బిల్లు రూ.1007.20 అవుతుంది. అంటే నెల బిల్లు 247.20 పెరుగుతుందన్న మాట.
ఏ ఉపకరణంపై ఎలాంటి జాగ్రత్త అవసరం
రిఫ్రిజిరేటర్: పాత ఫ్రిజ్‌లకు కరెంట్ ఎక్కువ కాలుతుంది. డీప్‌ఫ్రిజ్‌లో మంచు గడ్డ కడుతోందంటే కాలం చెల్లినట్లే. పాతదాంతో 166 యూనిట్లు కాలితే కొత్త ఫ్రిజ్‌తో వంద యూనిట్ల లోపే వస్తుంది. బిల్లులో నెలకు రూ.300కు పైగా ఆదా అవుతుంది. ఫ్రిజ్‌కు, గోడకు మధ్య ఎక్కువ ఖాళీ స్థలం ఉండేలా చూడాలి.
ఏసీ: సాధారణ రోజుల్లోనూ ఏసీల వినియోగం పెరుగుతోంది. 18-19 డిగ్రీల మధ్య కాకుండా, 24-26 డిగ్రీలు ఉండేలా చూసుకుంటే విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఏసీతోపాటు ఫ్యాన్ వేసుకోవడం మేలు. అలానే ఏసీ గదిలో అనవసర వస్తువులు ఉంటే తీసేయాలి.
వాషింగ్ మెషిన్: ఎప్పటి దుస్తులు అప్పుడు ఉతికేయడం చాలామందికి అలవాటు. పూర్తిగా లోడు అయ్యాకే వాషింగ్ మెషిన్ ఉపయోగించాలి. రోజువారీ దుస్తులకు వేడి నీరు అవసరంలేదు.
గీజర్: గీజర్ ఉన్న ఇళ్లలో 200 యూనిట్లు దాటడంతో బిల్లు రూ.వెయ్యిపైనే వస్తుంటుంది. బిల్లు తగ్గాలంటే ఇంట్లోవారు వెనువెంటనే స్నానాలు చేయాలి. థెర్మోస్టాట్ 50-60 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండేలా చూసుకోవాలి. రెండు స్నానాల గదులుంటే ఒకటే గీజర్ నీటిని వాడేలా పైపులు ఉండాలి.
మైక్రోఓవెన్: వండే పదార్థాన్ని బట్టి సమయాన్ని నిర్దేశించుకోవాలి. మధ్యలో తరచూ తెరిచి చూడటం వల్ల ఉష్ణోగ్రత 25 డిగ్రీలకు పడిపోతుంది. మళ్లీ వేడెక్కేందుకు అధిక విద్యుత్తు ఖర్చవుతుంది.