చినుకుపడితే నగరం(hyderabad rains 2021) చిత్తడవుతోంది. వీధులన్ని వరదలవుతున్నాయి. కాలనీలన్ని చెరువులవుతున్నాయి. నాలాలు ఉప్పొంగుతున్నాయి. నగరం(hyderabad rains 2021)లో వర్షం అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ప్రదాన రహదారులపై నీరు చేరి వాహనదారులు నరయాతన అనుభవిస్తున్నారు. ట్రాఫిక్ జామ్‌తో ఇంటికి ఎప్పుడు వెళ్తాడో తెలియని పరిస్థితి. బయటకు వెళ్లిన మనిషి ఎప్పటికి వస్తాడో అన్న పరిస్థితి నుంచి.. తిరిగి వస్తాడో లేదో అన్న దుర్బర స్థితి వచ్చింది. ఎక్కడ ఏ నాలా నోరుతెరుచుకుని చూస్తుందోనని బయటకు వెళ్లేందుకే జంకుతున్నారు. రహదారులపై నిలిచిన నీటిని వెంటనే పంపేందుకు మ్యాన్ హోల్ మూతలు తెరిచి... పర్యవేక్షణ లేకపోవడం వల్ల వాటిలో పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్న కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు చోట్ల నాలాల్లో పడి ఇద్దరు గల్లంతు కాగా.. ఒకరి మృత దేహం లభ్యమైంది. ఇంకొకరి ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఇవిలా ఉంటే.. వరద నీటిలో కొట్టుక్కొచ్చిన మృతదేహాల వివరాలు ఇప్పటికీ తెలియరాకపోవటం చర్చనీయాంశంగా మారింది.
ప్రమాదవశాత్తు నాలాల్లో పడి..
ఈనెల 25న మణికొండలోని గోల్డెన్ టెంపుల్ వద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగి రజినీకాంత్ నాలాలో గల్లంతయ్యాడు. భారీ వర్షం కారణంగా పైప్‌లైన్ మరమ్మతుల కోసం తీసిన గుంత నీటితో నిండిపోయింది. వర్షంలో కాలినడకన వస్తున్న రజినీకాంత్.. అదుపుతప్పి అందులో పడిపోయాడు. రెండు రోజుల గాలింపు తర్వాత నెక్నాంపూర్ చెరువులో రజినీకాంత్ శవమై తేలాడు. అదే రోజు కుత్బుల్లాపూర్ గణేష్ టవర్స్‌లో నివాసం ఉండే మోహన్ రెడ్డి నాలాలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన రెండు రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది. మోహన్‌రెడ్డి కోసం పోలీసులు ఇప్పటికీ గాలిస్తూనే ఉన్నారు.
కొట్టుకొచ్చిన మృతదేహాలు..
మరోవైపు... అదే రోజున కృష్ణానగర్‌కు వరద నీటిలో గుర్తుతెలియని మృతదేహం కొట్టుకు వచ్చింది. ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చినట్టుగా భావించిన కాలనీ వాసులు... పోలీసులకు సమాచారం అందించారు. మృతుని వివరాలు ఇంకా తెలియారాలేదు. ఎటువంటి మిస్సింగ్ కేసు నమోదు కాలేదు. మూడు రోజుల క్రితం జీడిమెట్లలోని ఫోక్స్సాగర్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. దాని వివరాలు కూడా తెలియారాలేదు.
అజాగ్రత్తతో గల్లంతు..
హైదరాబాద్‌తో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలటం వల్ల మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. ఈ నెల 28న మూసీ వరద నీటిలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వరద ఉదృతి కారణంగా మృతదేహాన్ని పోలీసులు బయటకు తీయలేకపోయారు. మరో ఘటనలో జియాగూడకు చెందిన శ్రీనివాస్... ఈత కొట్టేందుకు మూసీలో దిగి గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చేపట్టగా... పురానాపూల్ శ్మశానవాటిక వద్ద మూసీ ఒడ్డున మృతదేహం లభ్యమైంది. తాజాగా.. చాదర్‌ఘాట్ పరిధిలోని శంకర్‌నగర్‌లో బహిర్భూమికి కుమారుడితో పాటు వెళ్లిన జహంగీర్ మూసీలో కొట్టుకుపోయాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరివాహక ప్రాంతంలోని ఠాణాలకు సమాచారం అందిచారు. డీఆర్‌ఎఫ్ బృందాలు జహంగీర్ కోసం గాలిస్తున్నాయి.
అజాగ్రత్త, నిర్లక్ష్యం వెరసి నగరవాసుల ప్రాణాలు వరదలో గల్లంతవుతున్నాయి. ఇంత జరుగుతున్నా... మూసీ పరివాహక ప్రాంతంలో ఇప్పటి వరకూ అధికారులు పూర్తిస్థాయి పర్యవేక్షణ ఏర్పాటు చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సంబంధిత కథనాలు..