ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టం నుంచి తేరుకోకముందే... మంగళవారం మరోమారు నగరంలో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. రాత్రి పదిగంటల తర్వాత కొద్దిసేపు వాన కురవడంతో అబిడ్స్, కోఠి సహా పలుప్రాంతాలు జలమయమయ్యాయి. గరిష్ఠంగా ఉప్పల్ బండ్లగూడలో 5.08 సెం.మీ. వర్షం కురిసింది. బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్ల పరిధిలోని అనేక కాలనీలు రెండు నెలలకుపైగా ముంపులో ఉండగా.. నగరంలోని పలు ప్రాంతాలు పది రోజులుగా తడిసి ముద్దవుతున్నాయి.
శివారు ప్రాంతాల నుంచి వరదతో పాటు ప్రధాన నగరంలో కురుస్తున్న వర్షం కూకట్‌పల్లి, అల్వాల్, హయత్‌నగర్, సరూర్‌నగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, మెహిదీపట్నం మధ్యనున్న ప్రాంతాలను అంధకారంలోకి నెట్టింది. కొన్ని కాలనీల్లో సోమవారానికి వరద కాస్త తగ్గుముఖం పట్టినా మంగళవారం వానతో మళ్లీ పెరిగింది. సొంతిళ్లు ఉన్నప్పటికీ రెండు వారాలుగా దాహం, ఆకలి, కాలకృత్యాలు తీర్చుకునేందుకు అవస్థలు పడుతున్నామని కొన్ని కాలనీల్లో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పునరావాస కేంద్రాల్లో అరకొర వసతులపై జనం ఆగ్రహంగా ఉన్నారు.
వరద సహాయ చర్యల్లో సైన్యం
వరద సహాయక చర్యల్లో భారత సైన్యం సేవలు అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు రాబోయే రోజుల్లోనూ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఇప్పటికే ఉన్న 6 వరద సహాయక బృందాలకు తోడు అదనంగా 9 బృందాలను పడవలతో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు.
పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
బాధిత కాలనీల్లో ఎక్కడ చూసినా నడుంలోతు వరద లేదా మోకాల్లోతు బురద కనిపిస్తోంది. ముంపు తగ్గినప్పుడు దుర్వాసన రేగుతోంది. క్రిమికీటకాలు, పాములు, పశువులు, ఇతర ప్రాణుల కళేబరాలు తేలుతున్నాయి. సరైన తాగునీరు లేక ప్రజలు జ్వరం, డయేరియా, ఇతర వ్యాధులకు గురవుతున్నారు. వైద్య శిబిరాలు లేకపోవడంతో చాలామంది ఫీవర్ ఆస్పత్రికి వరుసకడుతున్నారు.
ఇవీ చూడండి: ఏ క్షణంలోనైనా రంగంలోకి దిగేందుకు ఆర్మీ బలగాలు సిద్ధం